ఒక క్లిక్ తో సిటీ రోడ్లపై లైట్లు ఆన్-ఆఫ్!!

Posted December 24, 2016

light on and off on city roads by oneclick
హైదరాబాద్ లో లైట్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కొన్నిచోట్ల పట్టపగలు వీధి దీపాలు వెలుగుతుంటాయి. మరికొన్ని చోట్ల చిమ్మచీకటి ఉన్నా లైట్లు వేసే నాథుడు ఉండడు. ఈ వెలుగులు-చీకట్లతో జనం మాత్రం ఇబ్బందులు పడుతుంటారు. ఇన్నాళ్లకు జీహెచ్ఎంసీ ఒక మంచి ఆలోచన చేసింది. ఈ లైట్ల సమస్యకు పరిష్కారాన్ని వెతికింది. అదేటంటే ఒక్క క్లిక్ తో లైట్లను ఆన్-ఆఫ్ చేసే సౌకర్యం హైదరాబాద్ లో అందుబాటులోకి రానుంది.

ఎల్ఈడీ విద్యుత్ దీపాల కోసం ఏర్పాటు చేసిన సర్క్యూట్లో అదనంగా కొత్త టెక్నాలజీని అమర్చుతారు. దీనిని ఏర్పాటుచేసిన మార్గంలో విద్యుత్ దీపాలు వెలగాలంటే కంప్యూటర్లో క్లిక్ చేస్తే సరిపోతుంది. అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ లేకపోతే అటోమెటిక్గా వీధిదీపాలు తక్కువ వెలుతురును ఇస్తాయి. ట్రాఫిక్ పెరిగితే వెలుతురు పెరుగుతుంది. అలాగే వీధి దీపాలను నిర్ధిష్ట సమయాలలో వెలిగేలా చేయవచ్చు. దీనిని మ్యానువల్ గానూ ఆపరేట్ చేసే అవకాశముంది.

ప్రస్తుతం ఈ విధానం రష్యాలో అమలవుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫీషియెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్), జీహెచ్ఎంసీ మధ్య ఒప్పందం జరిగింది. ప్రయోగాత్మకంగా శేరిలింగంపల్లి సర్కిల్లోని మాదాపూర్ కాకతీయ హిల్స్ కమాన్ రోడ్డులో నూతన టెక్నాలజీని అమర్చారు. నాలుగు రోజులుగా దీన్ని అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడ వర్కవుట్ అయితే త్వరలోనే సిటీ మొత్తం దీన్నే అప్లయ్ చేయాలని ప్లాన్ జరుగుతోందట.