ఫారెస్ట్ మినిస్ట‌ర్ గా లోకేశ్!!

Posted February 4, 2017

lokesh as forest minister
నారా లోకేశ్ కు మినిస్ట్రీ రావడం ఖాయమైపోయింది. ఇక ఏ శాఖ ఇస్తారాన్నదే మిగిలి ఉంది. అయితే ఆయనకు ఏ శాఖ ఇస్తారని ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. బాబు సన్నిహితుల మాటలను బట్టి చూస్తే.. చినబాబుకు అటవీశాఖ లేదా… మున్సిపల్ శాఖను ఇచ్చే అవకాశముందని టాక్. ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయట.

ప్రస్తుతం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. స్మగ్లర్ల ఆటకట్టించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్న వాదన వినిపిస్తోంది. సంబంధిత శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఉన్నా.. ఆయన వల్ల కూడా కావడం లేదు. అందుకే ఎర్రచందనానికి చెక్ పెట్టేందుకు లోకేశ్ కు ఆ పదవి ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారట చంద్రబాబు.

లోకేశ్ కు జిల్లా గురించి మంచి అవగాహన ఉంది. పైగా యువకుడు. క్యాడర్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఆయన ఫారెస్ట్ మినిస్టర్ అయితే పరిస్థితి ఇప్పటిలా మాత్రం ఉండదు. ఎందుకంటే లోకేశ్ కు మంచి నెట్ వర్క్ ఉంది. సమస్య మూలాల్లోకి వెళ్లే అవకాశముంది. స్మగ్లింగ్ కు చెక్ పెట్టడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రావడం ద్వారా లోకేశ్ ఇమేజ్ కూడా మరింత పెరుగుతుంది. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకొని .. ఆయనకు అటవీశాఖ ఇవ్వాలనే యోచన చేస్తున్నారట చంద్రబాబు. అంతేకాదు జిల్లాకు ఇంఛార్జ్ మినిస్టర్ బాధ్యతను కూడా ఆయనకే ఇవ్వడం ద్వారా జిల్లాపై సర్వహక్కుల లోకేశ్ కు ఇవ్వాలన్నది బాబు గారి వ్యూహమట.

యువనేతకు మున్సిపల్ శాఖ ఇచ్చే ఆలోచన కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీల పనితీరును మెరుగుపర్చడానికి లోకేశ్ కు ఈ అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. కానీ చినబాబు మాత్రం అటవీశాఖ వైపే మొగ్గు చూపుతున్నారని టాక్. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలిపోయిందని సమాచారం. చంద్ర‌బాబు స‌న్నిహితుల నుంచి కూడా ఇలాంటి లీకులే వస్తున్నాయి.