కేసీఆర్ కు మంద‌కృష్ణ షాక్?

Posted February 5, 2017

mandakrishna shock to kcr
సీఎం కేసీఆర్ ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం అఖిల‌ప‌క్షాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. తేదీని కూడా నిర్థారించారు. పీఎంవో నుంచి ఈనెల 6న ర‌మ్మంటూ ఆహ్వానం కూడా వ‌చ్చింది. ఇక తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ స‌హా అన్ని పార్టీలు మీటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్న త‌రుణంలో.. పీఎంవో అధికారులు చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. భేటీని వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. భేటీ తేదీని త్వ‌ర‌లోనే నిర్ణ‌యిస్తామ‌ని చెప్పుకొచ్చారు. హ‌ఠాత్తుగా ఈ మీటింగ్ ర‌ద్దుతో సీఎం కేసీఆర్ కూడా షాక్ కు గుర‌య్యార‌ట‌.

పీఎంవో మీటింగ్ ను వాయిదా వేయ‌డంపై కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అఖిల‌పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే ఆ క్రెడిట్ అంతా సీఎం కేసీఆర్ కే వెళ్లుంది. ఎందుకంటే ఆయ‌న నాయ‌క‌త్వంలో అఖిల‌ప‌క్షం వెళ్తుంది కాబ‌ట్టి అది కామ‌నే. ఒక‌వేళ ప్ర‌ధాని వ‌ర్గీక‌ర‌ణ‌కు ఒప్పుకున్నా… ఒప్పుకోక‌పోయినా… కేసీఆర్ కు మైలేజ్ రావ‌డం ఖాయం. అదే జ‌రిగితే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం పోరాడుతున్న మందకృష్ణ రేసులో వెనుక‌బ‌డిపోతారు. ఇన్నేళ్ల మంద‌కృష్ణ పోరాటం వృథా అవుతుంది. అందుకే ఈ భేటీ వాయిదా ప‌డేలా ఆయ‌నే ఏదో చేసి ఉంటార‌ని టాక్.

మంద‌కృష్ణ‌కు.. కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడుతో స‌న్నిహిత సంబంధాలున్నాయి. వ‌ర్గీక‌ర‌ణ క్రెడిట్ కేసీఆర్ కు ద‌క్క‌కుండా మీటింగ్ ఎలాగైనా వాయిదా ప‌డేలా చూడాల‌ని మంద‌కృష్ణ‌.. వెంక‌య్య‌తో మొరపెట్టున్నార‌ట‌. దీంతో విష‌యం వెంక‌య్య‌కు కూడా అర్థ‌మైందట‌. దీంతో నాయుడు గారు ఇష్యూపై కూలంక‌షంగా చ‌ర్చించార‌ట‌. అన్నీ ఆలోచించి భేటీని వాయిదా వేయ‌డ‌మే క‌రెక్ట‌ని బీజేపీ పెద్ద‌ల‌కు సూచించార‌ట‌.

వెంక‌య్య‌నాయుడు లాంటి నేత చెప్ప‌డంతో బీజేపీ పెద్ద‌లు కూడా భేటీ వాయిదా వేయ‌డానికే మొగ్గు చూపార‌న్న వాద‌న ఉంది. దీంతో పీఎంవో అధికారుల‌కు స‌మాచారం వెళ్లింద‌ట‌. భేటీని వాయిదా వేయాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వెళ్లాయ‌ని టాక్. దీంతో పీఎంవో భేటీని ర‌ద్దు చేసింద‌ని స‌మాచారం. మొత్తానికి మంద‌కృష్ణ వేసిన ఎత్తుగ‌డ ఫ‌లించింద‌ని ఎమ్మార్పీఎస్ నాయ‌కులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారట‌.