అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న

0
142

Posted May 18, 2017 at 10:22

manmohan singh rule is better than narendra modiమన్మోహన్‌ సర్కార్‌తో నరేంద్రమోడీ సర్కార్‌ పోటీ పడ్తోంది. కాంగ్రెస్‌ హయాంలో కుప్పలు తెప్పలుగా కుంభకోణాలు వెలుగు చూశాయి. చిత్రంగా, లెక్కలేనన్ని సీబీఐ కేసుల్నీ అప్పట్లో చూశాం. నరేంద్రమోడీ హయాంలో పెద్దగా కుంభకోణాలు చోటు చేసుకోలేదుగానీ, కుప్పలు తెప్పలుగా సీబీఐ కేసుల్ని చూస్తున్నాం. ఓ వైపు సీబీఐ, ఇంకోవైపు ఈడీ, మరోవైపు ఐటీ.. ఇలా ముప్పేట దాడి జరుగుతోంది. అయితే, దాడుల్ని ఎదుర్కొంటున్నవారంతా అక్రమార్కులేనా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు సర్వసాధారణమైపోయాయి. చిత్రంగా ఆయా సంస్థలు ‘దాడుల్లో’ దూకుడు చూపించడం, ఆ తర్వాత సైలెంటయిపోవడం చూస్తూనే వున్నాం. వ్యవహారం కోర్టు మెట్లెక్కాక.. ఏ విచారణ సంస్థ అయినా చెయ్యడానికేమీ వుండట్లేదు. ఇదో విచిత్రం. కొంతమంది జైలుకు వెళుతున్నారు, కొందరు బెయిల్‌ తెచ్చుకుంటున్నారు. ఈ తంతు ఇలా నడుస్తుండగానే కొత్త కొత్తగా కేసులు వెలుగు చూస్తూనే వున్నాయి. మన్మోహన్‌ హయాంలో కనిమొళి సహా తమిళనాడుకి చెందిన పలువురు ముఖ్య నేతలు జైలుకెళ్ళారు.

అన్నట్టు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్ళిందీ మన్మోహన్‌ హయాంలోనే. ఆ తర్వాత కనిమొళి సహా తమిళనాడుకి చెందిన ముఖ్య నేతలంతా ఆ తర్వాత ఆయా కేసుల్లోంచి ఎలాగోలా బయటపడ్డారు. వైఎస్‌ జగన్‌ మీద ఇంకా కేసుల కత్తి వేలాడుతూనే వుందనుకోండి.. అది వేరే విషయం. ఏడాది.. రెండేళ్ళు.. మూడేళ్ళు.. ఐదేళ్ళు.. ఇలా ఏళ్ళు గడిచిపోతున్నాయి తప్ప, పైన చెప్పుకున్న ఏ కేసూ ఓ కొలిక్కి వచ్చిన దాఖలాల్లేవు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కేసులు. ఇవెప్పటికి తేలేను.?