తెలుగు మీడియం శుద్ధ దండుగా..?

0
99

Posted April 28, 2017 at 10:49

minister narayana insults telugu languageఏంటో మన తెలుగువారి దౌర్భాగ్యం. మిగతా దక్షిణాది భాషలన్నీ మాతృభాషల్ని నెత్తిన పెట్టుకుంటే.. మనం మాత్రం తెలుగు భాషను కాళ్ల కింద తొక్కి పెట్టాం. ఇది చాలదన్నట్లుగా ఇంట్లో పిల్లలతో కూడా ఇంగ్లీష్ మాట్లాడిస్తూ తెగ మురిసిపోతున్నాం. ఇప్పుడు ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యలు ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి. బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉన్న నారాయణ.. ఈ మధ్య తరచుగా తప్పులు చేస్తూ బాబుకు బుక్కవుతున్నారు. అయినా ఏమీ మారలేదనడానికి తాజాగా చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ.

దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయులు కీర్తిస్తే.. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాత్రం తెలుగు మీడియం శుద్ధ దండుగ అనడం కలకలం రేపుతోంది. తెలుగు అధికార భాషగా ఉన్న రాష్ట్రంలో ఓ మంత్రి ఇలా మాట్లాడమేంటని భాషావేత్తలు ప్రశ్నిస్తున్నారు. తెలుగు మీడియంలో చదివితే ర్యాంకులు రావని, అసలు ఏ ఎంట్రన్స్ చూసినా మొదటి ఐదు వేల ర్యాంకుల్లోపు వచ్చేవారిలో తెలుగు మీడియం వాళ్లు కాగడా వేసినా కనిపించరని నారాయణ మాట్లాడారు.

మున్సిపల్ శాఖ మంత్రిగా మున్సిపల్ స్కూళ్లను మెయింటైన్ చేయాల్సిన నారాయణ.. కర్నూలు జిల్లా నంద్యాలలో మున్సిపల్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులతో మీటింగ్ లోనే ఇలాంటి మాటలు మాట్లాడటం విమర్శలకు తావిచ్చింది. ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే ర్యాంకులొస్తాయని, అందుకే మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేశామని చెప్పారు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థుల కంటే.. గతంలో తెలుగు మీడియంలో చదివినా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఉన్న వారి గురించి నారాయణ ఏమంటారని నిలదీస్తున్నారు విమర్శకులు.