లైట్లు తీసేస్తే వెలుగొచ్చేస్తుందా..?

Posted April 21, 2017 at 10:38

modi says don't use red blue and orange light on the vip carsరెడ్, ఆరెంజ్, బ్లూ.. రంగేదైనా వీఐపీ అంటే.. కార్లపై లైట్ ఉండాల్సిందే. ఇదీ ఇన్నాళ్లూ స్వతంత్ర భారతంలో కనిపించిన దృశ్యాలు. కానీ ఇక వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడామని కేంద్రం చెప్పుకుంటోంది. కానీ నిజంగా అలాగే జరుగుతుందా.. అంటే మిథ్యే అనిపిస్తున్నాయి పరిస్థితులు. లైట్ తీసేస్తే సౌండ్ పొల్యూషన్ తగ్గుతుందేమో కానీ.. వీఐపీల పేరుతో పోలీసులు, అధికారులు చేసే హడావిడి ఏమీ తగ్గదు. నిజంగా వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలనుకుంటే.. సాధారణ పౌరుల్లాగా కేంద్రమంత్రులు తిరగ్గలరా అనేదే ప్రశ్న.

అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా కేంద్రంతో పోలిస్తే.. రాష్ట్రాల్లో వీఐపీలతో పాటు వాళ్ల అనుచరులు కూడా దర్జా వెలగబెడుతున్నారు. టోల్ ప్లాజాలపై దాడులు, పోలీసులతో షూస్ మోయించడం, అబ్బో వీఐపీల బాగోతాలు చెప్పుకుంటే భారతమంత అవుతుంది. అందుకే షోకేస్ ఆదేశాలు మానేసి.. పని చేసి చూపించాలంటున్నారు సామాన్యులు. ఇప్పటికీ ఓ ఎమ్మెల్యే వస్తే ట్రాఫిక్ జామ్ కావాల్సిందే. ఎమ్మెల్యే అయితే పైనుంచి దిగొచ్చారా.. సాధారణ ప్రజలకు ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు అతనికి ఎందుకు వద్దు.. అంటే సమాధానమే లేదు.

సామాన్యుల్లా బతికితే జనం సమస్యలేంటో తెలుస్తాయి. అంతే కానీ గిరి గీసుకుని వీఐపీల మంటూ బిల్డప్ ఇస్తే అసలేం తెలుస్తుందనే వాదన నిజమే. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే మాతృక అయిన బ్రిటన్లో హోదాల జంఝాటాలేమీ ఉండవు. ప్రధానికి కూడా లిమిటెడ్ గానే సెక్యూరిటీ ఉంటుంది. మాజీ ప్రధాని అయితే అసలేమీ ఉండదు. ఇక సెనేటర్లు సైకిల్ తొక్కుంటూ పార్లమెంట్ కు వస్తారు. అలాంటి సంఘటనలు మన దేశంలో పుచ్చలపల్లి సుందరయ్య మాత్రమే చేసి చూపించగలిగారు. ప్రొటోకాల్ పేరుతో నేతలు పెడుతున్న ఖర్చు సున్నా చేస్తే.. అప్పుడు నేతలది నిజమైన చిత్తశుద్ధి అని నమ్ముతామంటున్నారు జనం.