నోట్ల క‌ష్టాలు తీరాలంటే 9 నెల‌లు ఆగాల్సిందే

Posted December 4, 2016

 more 9 months for currency troubles
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశవ్యాప్తంగా జ‌న‌మంతా ఇబ్బందులు ప‌డుతున్నారు. క‌రెన్సీ కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. ప‌నులు మానుకొని మ‌రీ గంట‌ల త‌ర‌బ‌డి ప‌డిగాపులు కాస్తున్నారు. ఈ నోట్ల క‌ష్టాలు ఇప్ప‌ట్లో తీరేలా క‌నిపించ‌డం లేదు. నగ‌దు అందుబాటులో ఉంచుతామ‌ని ఆర్బీఐ చెబుతున్నా… అది చేత‌ల్లో క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికీ చాలా బ్యాంకుల్లో న‌గ‌దు అందుబాటులో లేదు. బ్యాంకు తెరిచిన కాసేప‌టికే నో క్యాష్ అంటూ స‌మాధానం వ‌స్తోంది. అక్క‌డ‌క్క‌డా బ్యాంకుల్లో క్యాష్ ఉన్నాకిలోమీట‌ర్ల మేర క్యూలైన్లు క‌నిపిస్తున్నాయి.

కొన్ని రోజుల్లో న‌గ‌దు అంద‌రికీ అందుబాటులో వ‌స్తుంద‌ని కేంద్రం చెబుతోంది. ఆర్బీఐ కూడా అదే వ‌ల్లె వేస్తోంది. కానీ వాస్తవం చూస్తే అది శుద్ధ అబద్ధ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌న దేశంలో ర‌ద్దయిన 500,1000 రూపాయ‌ల నోట్ల సంఖ్య 2 వేల 300 కోట్లు. కానీ వీటి స్థానంలో కొత్త నోట్ల‌ను ప్రింట్ చేసేందుకు మ‌న ద‌గ్గ‌ర ముద్ర‌ణ కేంద్రాలు పెద్ద‌గా లేవు. దేశ‌వ్యాప్తంగా ముద్ర‌ణా కేంద్రాలు ఉన్న‌వి నాలుగే. వాటి స్థానంలో కొత్త‌గా 500, 2000 రూపాయ‌ల నోట్ల‌ను నిరంత‌రాయంగా ముద్రిస్తే ఒక్క నెల‌లో ప్రింట్ అయ్యే నోట్లు 250 కోట్లు మాత్ర‌మే. ఈ లెక్క‌న మొత్తం నోట్ల‌ను ముద్రించ‌డానికి ప‌ట్టే స‌మ‌యం 9 నెల‌లు.

మ‌న‌దేశంలో చ‌లామ‌ణిలో ఉన్న న‌గ‌దులో పెద్ద నోట్ల రూపంలో ఉన్న డ‌బ్బు 86 శాతం. అంటే 14 శాతం మాత్ర‌మే చిన్న‌నోట్ల రూపంలో ఉంది. అంటే ఆ పెద్ద నోట్ల‌న్నీ ప్రింట్ అయి వ‌చ్చే స‌రికి ఈ 14 శాతం నోట్లే మ‌న‌కు ఆధారం. అంటే ఇంకో 9 నెలలు ఆగితే కానీ పెద్ద నోట్ల‌న్నీ అందుబాటులోకి రావు. అప్ప‌టిదాకా ఈ నోటు క‌ష్టాలు త‌ప్ప‌వు. మోడీ స‌ర్కార్ ఎన్ని మాట‌లు చెప్పినా… జ‌రిగేది కూడా అదే.