ఎంపీ క‌విత కేంద్ర‌మంత్రి కానున్నారా?

Posted November 25, 2016

mp kavitha to become caabinet minister
బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య మొద‌టి నుంచి ఎక్క‌డా స్నేహం లేదు. 2014 స‌మ‌యంలో కేసీఆర్.. న‌రేంద్ర‌మోడీపై బ‌హిరంగంగానే ఘాటైన విమ‌ర్శ‌లను ఎక్కుపెట్టారు. కానీ ఎన్నిక‌ల త‌ర్వాత సీన్ మారింది. సీఎం కేసీఆర్… లాంగ్వేజ్ మారింది. అవ‌కాశ‌మొచ్చిన‌ప్పుడ‌ల్లా న‌రేంద్ర‌మోడీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ… స్నేహ‌హ‌స్తాన్ని అందిస్తూనే ఉన్నారాయ‌న‌. ఈ నేప‌థ్యంలో అటు మోడీ కూడా కేసీఆర్ ను దోస్త్ చేసుకునేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నార‌ట‌. ఈ విష‌యంలో ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ దాకా గుస‌గుస‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కేంద్ర‌మంత్రిగా క‌విత‌కు అవ‌కాశ‌మిస్తార‌ని చాలారోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ ఇప్ప‌టిదాకా ఆ దిశ‌గా సంకేతాలేవీ లేవు. దీంతో ఈ ఊహాగానాల‌కు తెర‌ప‌డింది.

ఇటీవ‌ల పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ పాజిటివ్ గా మాట్లాడారు. అంతేకాదు ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని సారుకు కొన్ని సూచ‌న‌లు కూడా చేశారు. కేసీఆర్ స‌ల‌హాల‌కు ఆయ‌న కూడా పొంగిపోయారంట‌. అదే స‌మ‌యంలో ఇటీవ‌ల హైద‌రాబాద్ లో సైబ‌ర్ సెక్యూరిటీపై కాన్ఫ‌రెన్స్ జ‌రిగింది. ఈ కాన్ఫ‌రెన్స్ లో మంత్రి కేటీఆర్ న‌రేంద్ర‌మోడీని ఆకాశానికి ఎత్తేశారు. పీఎం సార్ సూప‌ర్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామాల‌న్నీ చూస్తుంటే మోడీకి… టీఆర్ఎస్ చాలా ద‌గ్గ‌రైపోయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ కు కేంద్ర‌మంత్రి వ‌ర్గంలో ఛాన్స్ ద‌క్కుతుందన్న ఊహాగానాలు మరోసారి మొద‌ల‌య్యాయి. అదే జ‌రిగితే ఎంపీ క‌విత‌కు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి లాంఛ‌న‌మేనంటున్న వాద‌న వినిపిస్తోంది.