దేశం ఎమ్మెల్యే ఇంటికి ముద్రగడ..

Posted February 2, 2017

mudragada meets tdp mla gouthu sivaji in home
కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ముద్రగడ పద్మనాభం సరికొత్త ఎత్తుగడలతో రెడీ అవుతున్నారు. ఈ ఉద్యమానికి కాపుల మద్దతు కూడగట్టడం ఎంత ముఖ్యమో బీసీ ల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవడం అంతే ముఖ్యమని ముద్రగడ గుర్తించారు.అందుకే ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.సీఎం చంద్రబాబుని ఇప్పటికే తన మాటలతో చెడుగుడు ఆడేస్తున్న ముద్రగడ ఇప్పుడు ఆయనకి ఇంకో తలనొప్పి తెచ్చిపెట్టారు.కాపు రిజర్వేషన్ కి మద్దతు కూడగట్టేందుకు శ్రీకాకుళం వెళ్లిన ముద్రగడ తొలుతగా ఓ దేశం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు.ఆయనే గౌతు శివాజీ.బీసీ వర్గానికి చెందిన శివాజీని కలిసిన ముద్రగడ తమ రిజర్వేషన్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

ఓ వైపు టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబుని ఏకిపారేస్తూ …ఇంకో వైపు ఆ పార్టీకి చెందిన కాపు నాయకుల్ని పట్టించుకోకుండా ఇలా బీసీ నేతల్ని కలవడం ద్వారా ముద్రగడ ఏమి ఆశిస్తున్నారో అర్ధం కావడం లేదు.అదే విషయం గౌతు శివాజీని కూడా అయోమయంలోకి నెట్టింది.అందుకే ముద్రగడ మాటలకి పెద్దగా స్పందించకుండా భేటీ అయిందనిపించారు.అటు ముద్రగడ సైతం తనకు వారు మద్దతు పలికారని చెప్పలేదు.చంద్రబాబుని నియంతగా అభివర్ణిస్తూ తమది గొంతెమ్మ కోరిక కాదని ముద్రగడ వివరించారు.ఎన్నికల ముందు బాబు ఇచ్చిన హామీనే అమలు చేయమని కోరుతున్నట్టు బీసీ సంఘాల నేతలకి ముద్రగడ చెప్తున్నారు.కాపు రిజర్వేషన్ కి వ్యతిరేకంగా బీసీలు బాబు వైపు వెళ్లకుండా చూసేందుకే ముద్రగడ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ఇదంతా వైసీపీ ఆడిస్తున్న నాటకమని దేశం నేతలు అంటుంటే ..అదే పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ముద్రగడ సంచలనానికి తెర లేపారు.