ష‌ష్టి పూర్తి టైంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పెళ్లి..

Posted November 25, 2016

naradasu laxman rao and varsha register marriage
క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నార‌దాసు ల‌క్ష్మ‌ణ‌రావు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారు. 61 ఏళ్ల వ‌య‌స్సున్న ఆయ‌న ఇప్ప‌టిదాకా వివాహం గురించి ఆలోచించ‌లేదు. గ‌తంలో పీపుల్స్ వార్ లో ప‌నిచేసిన ఆయ‌న‌… ఆ త‌ర్వాత తెలంగాణ ఉద్య‌మంలోనూ క్రియాశీల‌కంగా ఉన్నారు. కేసీఆర్ కు వెన్నంటి నిలిచారు. ఈ బిజీ జీవితంలో ఎప్పుడూ ఆయ‌న ఒంట‌రిగా ఫీల‌వ్వ‌లేదు. అయితే గ‌తేడాది ల‌క్ష్మ‌ణ‌రావు వ‌దిన క‌న్నుమూశారు. చిన్న‌ప్ప‌టి నుంచి త‌న‌ను త‌ల్లిగా చూసిన ఆమె చ‌నిపోవ‌డంతో .. ల‌క్ష్మ‌ణ‌రావు ఒంట‌రి జీవితం గ‌డుపుతున్నారు.

గ‌త కొంత‌కాలం కింద‌ వ‌ర్ష అనే మ‌హిళ‌తో ల‌క్ష్మ‌ణ‌రావుకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మార‌డంతో ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాలని నిశ్చ‌యించుకున్నారు. వ‌ర్ష వ‌య‌స్సు ప్ర‌స్తుతం 41 ఏళ్లు కాగా.. ల‌క్ష్మ‌ణ‌రావు వ‌య‌స్సు 61 ఏళ్లు. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌స్సు అంత‌రం ఎక్కువ ఉన్నా.. వీరి పెళ్లికి వ‌య‌స్సు అడ్డంకి కాలేదు. ఇద్ద‌రూ త్వ‌ర‌లోనే రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. గ‌త అక్టోబరు నెలలో రిజిస్టర్ కార్యాలయంలో ల‌క్ష్మ‌ణ‌రావు దరఖాస్తు చేసుకోగా, దీనికి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. కరీంనగర్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని నోటీసు బోర్డులో నారదాసు పెళ్లి ప్రకటన అతికించారు.