మాటకారి సిద్ధూ చేతికి చిక్కినట్టే ..

Posted November 24, 2016

navajyoth singh sidhu caughtక్రికెట్ మైదానంలో బాట్ తో,గేలరీ లో కామెంటరీ తో అందరిని బుట్టలో పడేసిన నవజోత్ సింగ్ సిద్ధూ కి రాజకీయం మాత్రం కొరుకుడు పడలేదు.బీజేపీ లో అంతా మోడీ జపం చేస్తున్న తరుణంలో కాస్త వెరైటీ ప్రయత్నం చేసి సిద్ధూ ఫెయిల్ అయిపోయాడు.బీజేపీ ని వదిలి వెళ్తూ ఆ పార్టీ సొంత గడ్డని వదిలిపెట్టమంటే చూస్తూ ఊరుకుంటానా అని సిద్ధూ ఫైర్ అయిపోయాడు.ఆప్ తరపున సిద్ధూ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడని అంతా భావించారు.అయితే అది కూడా తేలిపోయింది.పంజాబ్ ఆప్ కొత్త బాస్ వద్దనుకుంది.దీంతో చిర్రెత్తుకొచ్చిన సిద్ధూ ఆప్ ని చీల్చినంత పని చేసి కొత్త పార్టీ పెట్టాడు ..ఆవాజ్ ఏ పంజాబ్ పేరుతో కొత్తగా ఏర్పాటైన ఆ పార్టీ వ్యవహారం కూడా మూడునాళ్ళ ముచ్చటే అయింది.

పార్టీ పెట్టినంత తేలిగ్గా దాన్ని నడపలేమని అర్ధమైంది సిద్ధూకి.దీంతో ప్రత్యామ్న్యాయ మార్గాల వైపు దృష్టి పెట్టాడు.బీజేపీ ని తానే వదిలేసాడు …ఆప్ తన్ను వద్దనుకుంది..దీంతో కాంగ్రెస్ ఒక్కటే మిగిలింది.ఏ పార్టీ వ్యవహారశైలిపై చెణుకులేస్తూ ఎంపీ గా గెలిచాడో మళ్ళీ అదే పార్టీ ని ఆశ్రయించాల్సి వచ్చింది.ఇలాంటి అదను కోసమే చూస్తున్న కాంగ్రెస్ కూడా వడివడిగా సిద్ధూ అండ్ కో ని సంప్రదించింది.ఫలితమే సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ కాంగ్రెస్ ఆగమనం ..మరి కొద్ది రోజుల్లో సిద్ధూ కూడా చేతికి చిక్కబోతున్నట్టే తెలుస్తోంది.