బెడిసికొట్టిన సిద్ధూ వ్యూహం!!

రాజ‌కీయాల్లో హ‌త్యలుండవు… ఆత్మ‌హ‌త్య‌లే ఉంటాయ‌ని చెబుతారు. ఎందుకంటే ఒక రాజ‌కీయ నాయ‌కుడు తాను తీసుకునే నిర్ణ‌యాలపైనే అత‌ని భ‌విష్యత్తు ఆధార‌ప‌డి ఉంటుంది. అందుకే ఏ నిర్ణ‌య‌మైనా పాలిటిక్స్ లో చాలా ఆలోచించి స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని చెబుతుంటారు. ఈ ప్ర‌స్తావ‌న ఎందుకంటే మంచి భ‌విష్యత్తు ఉన్న నాయ‌కుడిగా పేరు ప‌డ్డ మాజీ క్రికెట‌ర్ సిద్ధూ చివ‌ర‌కు సాదాసీదా నాయ‌కుడిగా కాంగ్రెస్ పంచ‌న‌ చేరాల్సి రావ‌డం.

ఫిబ్ర‌వ‌రి 4న పంజాబ్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో సిద్ధూ గ‌త కొన్ని నెల‌ల నుంచి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఫోక‌స్ అయ్యారు. మీడియాలో ఆయ‌న పేరు హైలైట్ అవ్వ‌డంతో ఆయ‌న కూడా ఆ దిశ‌గా ఆలోచించారు. అయితే అప్పటికి ఆయ‌న బీజేపీలో ఉండ‌డంతో … కొంత ప్ర‌య‌త్నించారు. అయితే క‌మ‌ల‌నాథులు త‌న విన్న‌పాన్ని మ‌న్నించే అవ‌కాశం ఆయ‌నకు క‌నిపించ‌లేదు. కానీ ఇక్క‌డే ఆయ‌న తొంద‌ర‌ప‌డ్డారు. బీజేపీ ఇచ్చిన రాజ్య‌స‌భ ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. ఎంత న‌చ్చ‌జెప్పినా ఒప్పుకోకుండా బీజేపీ నుంచి బ‌య‌ట‌కొచ్చేశారు.

బీజేపీ త‌ర్వాత ఆయ‌న ఆమ్ ఆద్మీ పార్టీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆప్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి సిద్ధూనేన‌ని చెప్పుకున్నారు. ఆదిశ‌గా సిద్ధూ- కేజ్రీవాల్ మ‌ధ్య సంప్ర‌దింపులు జ‌రిగాయట‌. కానీ ఎందుక‌నో అది వర్కవుట్ కాలేదు. ఆ త‌ర్వాత సొంత పార్టీ పెట్టారాయ‌న‌. అయితే ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఒక పార్టీ పెట్టి… దాన్ని న‌డిపించాలంటే ఎంత ప్లానింగ్ ఉండాలో అప్ప‌టికి గానీ ఆయ‌న‌కు అర్థం కాలేదు. చివ‌ర‌కు ఆయ‌న సీన్ అర్థ‌మైంది. పార్టీని న‌డ‌ప‌డం అంత ఈజీ కాద‌న్న విష‌యం బోధ‌ప‌డింది. చివ‌ర‌కు షట్ట‌ర్ క్లోజ్ చేసేశారు.

అటు బీజేపీలోకి తిరిగి వెళ్ల‌లేరు. ఆప్ తో దోస్తీ సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. అకాలీద‌ల్ లో చేరే ప‌రిస్థితి లేదు. ఈ ప‌రిస్థితుల్లో ఆయ‌న ముందు ఒక్క‌టే ఆప్ష‌న్ క‌నిపించింది. చివ‌ర‌కు రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఒక‌ప్పుడు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఫోక‌స్ అయిన ఆయ‌న ఇప్పుడు ఎమ్మెల్యే అభ్య‌ర్థి రేంజ్ కు ప‌డిపోయారు. పెద్ద‌గా ష‌ర‌తులు లేకుండానే ఆ పార్టీలో చేరిపోయారు.

సిద్ధూ బీజేపీలో ఉన్న‌ప్పుడే కొంత‌కాలం వేచి ఉంటే బావుండేదంటున్నారు విశ్లేష‌కులు. అక్క‌డే ఉంటే అధికారంలోకి వ‌స్తే మంచి ప‌ద‌వి అయినా ద‌క్కేది. ఒక‌వేళ అధికారంలోకి రాక‌పోతే ఎంపీ సీటు ఎలాగూ ఉండేది. కానీ అనాలోచిత నిర్ణ‌యాల‌తో చేజేతులారా ఆయ‌న త‌న భ‌విష్యత్తును తానే నాశ‌నం చేసుకున్నార‌ని బీజేపీ నాయ‌కులు ఆయ‌నపై సానుభూతి చూపిస్తున్నారు. ఇందులో వాస్త‌వం లేక‌పోలేదు… అందుకే అంటారు రాజ‌కీయాల్లో ఓపిక ఉండాలని.