ఖాకీలకు భూ పందేరం చేసిన నయీం..

  nayeem give places polices

తవ్విన కొద్దీ నయీం అక్రమాల చిట్టా బయటపడుతోంది. నయీంతో కలిసి కొందరు పోలీస్ ఉన్నతాధికారులు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినట్టు తేలింది. యాదగిరిగుట్టలో నయీంతో కలిసి ప్రస్తుత డీజీ స్థాయి అధికారి 80 ఎకరాలు కబ్జా చేశారని తెలిసింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్న ఓ పోలీస్ అధికారికి నయీంతో సత్సంబంధాలున్నాయని, ఓ ల్యాండ్ సెటిల్మెంట్ సందర్భంగా ఆయనకు గిఫ్ట్ కింద నయీం ఖరీదైన కారు ఇచ్చాడని సమాచారం. 18 ఏళ్ల క్రితం నయీం అండతో రెండు డంప్ లు వెలికి తీసిన ఓ డీసీపీ స్థాయి పోలీస్ అధికారి…. ప్రస్తుతం కోట్ల రూపాయలతో చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నారన్న ఆరోపణలున్నాయి.ఓ డీఐజీ స్థాయి అధికారికి ఫిల్మ్ సిటీ దగ్గర 12 ఎకరాల స్థలం గిఫ్ట్ గా ఇచ్చి … మరో 15 ఎకరాలు నయీం గ్యాంగ్ కబ్జా చేసింది.

ఏళ్ల తరబడి హైదరాబాద్ లో పనిచేస్తున్న ఓ అడిషనల్ డీసీపీకి… సిటీలో లిక్కర్ దందాను నయీం అప్పజెప్పినట్టు తెలిసింది. ఇక అజీజ్ రెడ్డి ఎన్ కౌంటర్ సమయంలో… ఓ కంటైనర్ నిండా డబ్బును కొందరు పోలీస్ ఉన్నతాధికారులు పంచుకున్నట్టు సమాచారం. ప్రతి ఏటా రంజాన్ పండుగ రోజు తనకు సహకరించిన అధికారులు, నేతలకు భూ పట్టాలు పంపిణీ చేయడం నయీంకు ఆనవాయితీగా వస్తోంది. భువనగిరిలోని దర్గాలో 16 ఏళ్లుగా నయీం ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాడు. ఆ కార్యక్రమానికి ప్రతి ఏటా పోలీసులు భారీ బందోబస్తు కల్పించారని తెలుస్తోంది.

హైదరాబాద్ శివరాంపల్లిలో పోలీసులు, బంధువులకు 400 ఎకరాలు సెటిల్మెంట్ లాండ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు నయీం. టెలికాం కాలనీలో ముగ్గురు సీఐలకు మూడు ఇళ్లు గిఫ్ట్ గా ఇచ్చాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర్లో 67 ఎకరాల భూ వివాదాన్ని సెటిల్ చేసేందుకు రీసెంట్ గా నయీం బేరం కుదుర్చుకున్నాడు. ఇక భువనగిరిలో ల్యాండ్ సెటిల్మెంట్ కు సహకరించిన పోలీస్ కమిషనర్ కు 8 ఎకరాలు గిఫ్ట్ గా ఇచ్చాడు నయీం. ఫిల్మ్ సిటీ సమీపంలో ఎస్ఐ నుంచి డీజీ ర్యాంక్ అధికారి దాకా 93 ఎకరాలు భూమిని గిఫ్ట్ గా ఇచ్చాడు.మల్కాజిగిరి భూవివాదంలో నిజామాబాద్ కు చెందిన రౌడీ షీటర్ ను… పోలీసు సుపారీతో నయీం హత్యచేశాడు.

చేవెళ్లలో అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారికి 100 ఎకరాలు ఇచ్చిన నయీం… మరో 50 ఎకరాలు తన వాచ్ మెన్ పేరుపై రిజిష్టర్ చేశాడు. ఓ పోలీస్ అధికారి సహకారంతో రాజకీయ నాయకుడికి బూరుగుపల్లిలో 200 ఎకరాల భూవివాదాన్ని సెటిల్ చేశాడు నయీం. ఇక శంకర్ పల్లి భూ వివాదంలో ఓ డాక్టర్, ఆయన కూతుర్ని కిడ్నాప్ చేసి…. వాళ్ల నుంచి 18 ఎకరాల భూమిని పోలీసులతో కలిసి తక్కువ రేటుకు రాయించుకున్నారు నయీం గ్యాంగ్. ఓ సర్దార్ జీ ప్రైవేట్ కేసు విషయంలో సెటిల్మెంట్ కోసం ఇంటలిజెన్స్ లో పనిచేసిన ఉన్నతాధికారితో కలిసి… 10 కోట్లు నయీం గ్యాంగ్ వసూలు చేసినట్టు తెలుస్తోంది.