నయీమ్ ఆస్తులు 10 వేలకోట్లు ?

 nayeem property 10 thousand crores
ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టార్ నయీం హతమైన తర్వాత పోలీసులు జరిపిన సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. డబ్బు, బంగారం, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక వందల సంఖ్యలో బ్యాంకు పాస్ బుక్ లు, చెక్ బుక్ లతో పాటు నయీం డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు శంషాబాద్ డీసీపీ చెప్పారు. ల్యాండ్ సెటిల్ మెంట్లు, భూముల వివరాలు, డబ్బుల వసూళ్లకు సంబంధించిన వివరాలు ఈ డైరీల్లో ఉన్నాయని తెలిపారు.

నయీం తనకుతానుగా తీర్పులు ఇవ్వడం, జరిమానా విధించి వసూలు చేసిన వివరాలు అతని డైరీలో ఉన్నట్టు చెప్పారు. దాదాపు పది వేల కోట్లపైనే ఆస్తులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారుబలవంతపు వసూళ్ల వివరాలను నయీం డైరీలో రాసుకున్నట్టు డీసీపీ వెల్లడించారు. ఎవరికి డబ్బులు ఇచ్చినది, ఖర్చు చేసిన వివరాలు డైరీలో ఉన్నాయని చెప్పారు. నయీం కొనుగోలు చేసిన స్థిర, చరాస్తుల వివరాలు డైరీలో ఉన్నాయని తెలిపారు. షెల్టర్లు, డెన్ లకు సంబంధించిన తాళాలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. నయీం టార్గెట్ చేసిన ధనవంతుల వివరాలను డైరీలో రాశాడని తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా శంషాబాద్ లో పోలీసులు ఎదురుకాల్పుల్లో నయీం హతమైయ్యాడు. ఆ తర్వాత శంషాబాద్, రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్, నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నయీం బంధువులు, అనుచరులు ఇళ్లల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు