ట్విట్ట‌ర్ వివాదంలో నితిన్!!

Posted February 8, 2017

nithin tweet took him into problems
వ‌రుస విజ‌యాల‌తో ఈ మ‌ధ్య జోరుమీదున్న యువ హీరో నితిన్. ఇత‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వీరాభిమాని. ప‌వ‌న్ పాట‌లు కూడా నితిన్ సినిమాలో వినిపిస్తాయి. ఇక ప‌వ‌ర్ స్టార్ కు కూడా నితిన్ అంటే అభిమానం. అందుకే నితిన్ సినిమా ఆడియో ఫంక్ష‌న్ల‌కు కూడా ప‌వ‌న్ వ‌స్తుంటారు. ఈ అభిమాన‌మే వివాదాల‌కు దూరంగా ఉండే నితిన్ ను ….. వివాదాల్లోకి లాగింది.

ఇటీవ‌ల కాట‌మ‌రాయుడు ట్రైల‌ర్ రిలీజైంది. ఇది నితిన్ కు తెగ న‌చ్చేసింది. ఇంకేముంది ప‌వ‌ర్ స్టార్ పై ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని పంచుకోవాల‌ని అనుకున్నాడు. అనుకున్న‌ట్టే ఒక లైన్ రాశాడు. ఆ ఒక్క‌లైనే అత‌న్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. కాట‌మ‌రాయుడు ముందు ఏ రాయుడూ సాటి రాడంటూ….నితిన్ ట్వీట్ చేయ‌డమే ఇందుకు కార‌ణం.

నితిన్ చేసిన ఈ ట్వీట్ పై మంచువారి అమ్మాయి ల‌క్ష్మీప్ర‌స‌న్న తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వెంట‌నే తేరుకున్న నితిన్ సారీ చెప్పాడు. తన ఉద్దేశ్యం అది కాదంటూ వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. సారీతో మంచు ల‌క్ష్మి కూడా మెత్త‌బ‌డ్డారు. దీంతో వివాదం అక్క‌డే స‌ద్దుమ‌ణిగింది.

సారీతో వివాదం స‌ద్దుమ‌ణిగినా…. నెటిజన్లు మాత్రం నితిన్ కామెంట్ల‌పై స్పందిస్తూనే ఉన్నారు. కొంద‌రు అత‌నికి మ‌ద్ద‌తు ప‌లుకుతుంటే… మోహ‌న్ బాబు అభిమానులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో నితిన్ చాలా మ‌న‌స్తాపం చెందాడ‌ట‌. అభిమానాన్ని చాటుకుందామ‌న్ని ట్విట్ట‌ర్ లో కామెంట్ చేస్తే… ఇలా జ‌రిగిందేంటి అని ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. అందుకే మ‌రి… సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న వ్య‌క్తులు ఏదైనా కామెంట్ చేసే ముందు ఒక‌టికి రెండు ఆలోచించుకోవాలి. లేక‌పోతే ఇలాంటి చిక్కులే వ‌స్తాయి.