ఎన్టీఆర్ బాధ్యత ఎవరికి ?

Posted February 7, 2017

ntr biopic movie director
ఎన్టీఆర్ ..తెలుగు జాతి గౌరవానికి,ఆత్మ గౌరవానికి ప్రతీక.ఆయన జీవిత చరిత్ర తీయడమంటే తెలుగు జాతి గౌరవాన్ని కాపాడడమే.ఆ పని చేయడం అంత తేలిగ్గాదు.ఎన్టీఆర్ బయోపిక్ చేయడం ఓ సాహసమే కాదు..అంతకుమించిన సవాల్.ఆ సినిమా స్క్రిప్ట్ విషయంలోనే ఇంత చర్చ సాగుతుంటే ఇక ఆ స్క్రిప్ట్ ని డీల్ చేసే దర్శకుడు ఎలా ఉండాలి ?ఈ విషయంలో బాలయ్య ఎవరి గురించి ఆలోచిస్తున్నాడో గానీ …ఫిలిం లవర్స్ ,ఎన్టీఆర్ అభిమానుల నుంచి మూడు పేర్లు వినిపిస్తున్నాయి.కె .రాఘవేంద్ర రావు,మణిరత్నం,రామ్ గోపాల్ వర్మ…ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే బాగుంటుందని ఓ అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కి ఎన్టీఆర్ తో వున్నఅనుబంధం అందరికీ తెలిసిందే.ఆ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎన్టీఆర్ జీవితాన్ని దగ్గరగా చూసిన వారిలో దర్శకేంద్రుడు ఒకరు.ఎన్టీఆర్ వ్యవహారశైలి ని,మనస్తత్వాన్ని తెలిసిన దర్శకేంద్రుడు ఈ సినిమా దర్శకుడు అయితే న్యాయం జరుగుతుందని ఓ వాదన.కానీ సాంఘిక,జానపద,భక్తి రస చిత్రాలు తీయడంలో తిరుగులేని రాఘవేంద్రుడు ఇప్పటి దాకా వివాదాస్పద సినిమాల జోలికి వెళ్ళింది లేదు.ఓం నమో వెంకటేశాయ తర్వాత దర్శకత్వ బాధ్యతల నుంచి దూరంగా వుండాలని దర్శకేంద్రుడు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ఆఫర్ వస్తే ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ల విషయంలో ఎక్స్ పర్ట్.నేరుగా పేరు చెప్పకుండా కొందరి జీవితాల్ని ఆయన తెరకెక్కించారు.అందులో కొన్ని మాఫియా చిత్రాలైతే,మరికొన్ని రాజకీయ నాయకులవి.రక్త చరిత్ర రెండు భాగాలు,వీరప్పన్,వంగవీటి వంటి చిత్రాలతో బయోపిక్ లు తీయడంలో రాము పట్టు సాధించారు.అయితే పబ్లిసిటీ కోసం ఆయన ఎన్ని వివాదాలు సృష్టిస్తారు గానీ బయోపిక్ లో వుండే వివాదాస్పద అంశాల గురించి మాత్రం మధ్యే మార్గాన్నే అనుసరిస్తున్నారు. ఇక వ్యక్తిగత వ్యవహారశైలి దృష్ట్యా బాలయ్య ,వర్మ కాంబో ఆసక్తి రేకెత్తించినా అది సెట్ కావడమే కష్టం.కానీ రాజకీయాల్లోనే కాదు ..సినిమా రంగంలోనూ ఏదైనా జరగొచ్చు.

ఎన్టీఆర్ సినిమా దర్శకత్వ సినిమా బాధ్యత కి సరితూగే మూడో దర్శకుడు మణిరత్నం.కళాత్మక,భావోద్వేగ ప్రధానమైన సినిమాలు తీయడంలో మణి పెట్టింది పేరు.ఇద్దరు సినిమాతో ఎంజీఆర్,కరుణానిధి జీవితాల్ని ఆయన ఎలా టచ్ చేశారో చూశాం.అయితే ఎన్టీఆర్ సినిమా విషయంలో మణికి నేటివిటీ సమస్య ఉంటుంది.

ఏదేమైనా ఎన్టీఆర్ బయోపిక్ అనగానే ఎక్కువమందిలో స్ఫురణకు వచ్చింది పైన మనం చెప్పుకున్న ముగ్గురు దర్శకులే.ఎన్టీఆర్ భారాన్ని వారిలో ఎవరు మోస్తారో..మరే పేరైనా ముందుకు వస్తుందో చూడాలి.