ఎన్టీఆర్ డబల్ బొనాంజా..వస్తే రెండు సినిమాలు

 Posted February 16, 2017

ntr double bonanza with two movies
ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని బాలయ్య ఏ ముహూర్తాన ప్రకటించాడో గానీ తేనె తుట్టె రేగింది.ఈ టైం లో ఎన్టీఆర్ సినిమా అందులో తమ క్యారెక్టర్ ఎలా ఉంటుందనేదానిపై ఇప్పటికే ఓ ముఖ్యమంత్రి,ఓ మాజీ ముఖ్యమంత్రి,ఓ మాజీ ముఖ్యమంత్రి భార్య,ఓ మాజీ ముఖ్యమంత్రి అల్లుడు సీన్ లోకి దిగిపోయారు.ఈ నలుగురూ చంద్రబాబు,నాదెండ్ల భాస్కరరావు,లక్ష్మి పార్వతి,దగ్గుబాటి అని వేరే చెప్పక్కర్లేదు.బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే అందులో తమనెలా చూపిస్తాడన్న భయం వారిది.అందుకే బాలయ్య ప్రకటన రాగానే తమ కోణాన్ని వివరించి సినిమా ఎలా తీయాలన్నదానిపై ఒత్తిడి పెంచారు.మాట వరసకి సినిమా ఎక్కడ మొదలుపెట్టాలో ఎక్కడ ముంగొంచాలో తనకు బాగా తెలుసని బాలయ్య అన్నారు.కానీ అది చెప్పినంత తేలిగ్గాదని ఈపాటికే అర్ధం అయివుంటుంది.

వారసులు లేని వందల,వేల ఏళ్లనాటి చారిత్రక కధల్ని టచ్ చేస్తేనే ఎన్నో విమర్శలు.పద్మావతి సినిమా తీస్తున్న సంజయ్ లీలా భన్సాలీ చెంపదెబ్బే తినాల్సి వచ్చింది.అలాంటిది ఓ 20 ఏళ్ళనాడు మన కళ్ల ముందు నడయాడిన ఓ మహానుభావుడి చరిత్ర ని ముట్టుకుంటే ఇలాంటి అభ్యంతరాలు రావడం సహజమే.ఈ అభ్యతరాలు వ్యక్తం చేసే వాళ్ళు అందుకు ఏ మార్గం ఎంచుకుంటారనేదే ముఖ్యం.పైన మనం చెప్పుకున్న నలుగురిలో ఒకరు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.ఒకవేళ బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తీసి రిలీజ్ చేస్తే …అందులో కంటెంట్ అభ్యంతరకరమనిపిస్తే దానికి ప్రతిగా ఇంకో సినిమా తీసి రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారంట.ఆయన కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడే.ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకి కాస్త దూరంగా వున్నా అవసరమైతే సినిమా నిర్మిస్తానని సన్నిహితులతో చెప్పారట.గతంలో ఓ సినిమా తీసి,ఇంకో దేశ భక్తుడు పాత్రలో నటించడానికి ప్రయత్నించిన ఆయన ఎన్టీఆర్ మీద ఇంకో సినిమా తీస్తే నిజంగా సెన్సేషన్ అవుతుంది.స్వల్ప వ్యవధిలోనే ఎన్టీఆర్ జీవితాన్ని రెండు కోణాల నుంచి చూసే అవకాశం దక్కుతుంది.