సోషల్ మీడియాలో సెల్వం దూకుడు!!

Posted February 11, 2017

o Panneerselvam Kabali Style against Sasikala
చిన్నమ్మపై తిరుగుబాటుతో జాతీయ మీడియాతో పాటు లోకల్ మీడియా కూడా సెల్వం వైపే నిలిచింది. అయినప్పటికీ జనంలోనూ తన ఇమేజ్ ను మరింత పెంచుకునేందుకు ఆయన సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. రజినీకాంత్ కబాలి స్టైల్ లో సెల్వం..పన్నీర్ సెల్వం అంటూ దూసుకుపోతున్నారు.

అన్నాడీఎంకే ఐటీ విభాగం సెల్వం చేతుల్లో ఉంది. దీంతో పన్నీర్ ఇంటి నుంచే ఐటీ విభాగం ప్రచారం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా ప్రచారం మొదలుపెట్టింది. సెల్వంను హీరోగా చేస్తూ.. పోస్టింగులు కనిపిస్తున్నాయి. ఫోటోలు, వీడియోలు వచ్చేశాయి. రజినీకాంత్ కబాలి స్టైల్ ఫోటోకు గ్రాఫిక్ వర్క్ తో సెల్వం ఫోటోను అతికించారు. కబాలి రా.. అనే డైలాగులో రజినీకాంత్ స్టైల్ ఎలా ఉంటుందో… సెల్వం కూడా అదే స్టైల్ లో వీడియోలో కనిపించారు. సెల్వం…పన్నీర్ సెల్వం అంటూ… ఆయన పలుకుతున్న డైలాగ్ ఇప్పుడు దుమ్ము రేపుతోంది. రజినీకాంత్ డైలాగ్ జనాన్ని ఎంత ఆకట్టుకుందో… ఈ వీడియో కూడా ఇప్పుడు అంతేస్థాయిలో జనాన్ని ఆకట్టుకుంటోంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదే సమయంలో శశికళకు కూడా వ్యతిరేకంగా పోస్టింగులు ఊపందుకున్నాయి. వాట్సప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లో చిన్నమ్మకు వ్యతిరేకంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల ఫోన్‌ నంబర్లన్నీ సామాజిక మాధ్యమాలకు చేరిపోయాయి. మీ ఎమ్మెల్యేను పన్నీర్‌కు మద్దతు ఇవ్వమంటూ సందేశాలు హోరెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు సెల్వంకు మద్దతివ్వాలంటూ జనం కూడా మెసేజ్ ను పంపుతున్నారు. ముఖ్యంగా యూత్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సెల్వం సారును భారీగా సపోర్ట్ చేస్తున్నారు.

ఈరకంగా సోషల్ మీడియాను తనకు అనుకూలంగా మార్చుకోవడం సెల్వం సక్సెస్ అయ్యారు. అదే సమయంలో క్యాంపు పాలిటిక్స్ తప్ప.. జనంలో తనపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి శశికళ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. దీంతో ఆ వ్యతిరేకత రోజురోజుకు ఎక్కువవుతోంది. పన్నీర్ సెల్వం మాత్రం అందరి దృష్టిలో హీరో అయిపోతున్నారు.