పాకిస్తాన్ కు అంత సీనుందా?

Posted December 22, 2016

Pakistani Politicians Want to Ban Large Notes
పెద్దనోట్ల రద్దుతో దేశప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో మంచి జరుగుతుందన్న మోడీ మాటలను బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఈ కష్టాన్ని భరిస్తూనే ఉన్నారు. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ చక్కర్లు కొడుతున్నా.. ఏనాడూ ఈ వ్యతిరేకత ప్రజాగ్రహంగా మారలేదు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా పెద్ద నోట్ల రద్దు దిశగా అడుగులేస్తుంది. ఒకవేళ అదే జరిగితే భారత్ లా.. పాక్ తట్టుకుంటుందా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.

బ్లాక్ మనీని అరికట్టేందుకు పాకిస్తాన్ లో ఉన్న అతిపెద్ద అయిన 5 వేల రూపాయల నోటును రద్దు చేయాలని ఆ దేశం నిర్ణయించింది. పాకిస్థాన్ సెనేట్ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ప్రస్తుతం పాక్ లో 3.4 లక్షల కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయి. వాటిలో 1.02 లక్షల కోట్లు 5వేల నోట్లేనట. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ముస్లింలీగ్‌కు చెందిన సెనేటర్ ఉస్మాన్ సైఫ్ ఉల్లా ఖాన్ 5 వేల నోట్ల రద్దుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి పార్లమెంటు ఎగువసభలో అత్యధిక సంఖ్యలో సభ్యులు ఆమోదం తెలిపారు. ఆమోదం వరకు ఒకే గానీ దాని పర్యవసాలు ఎలాగుంటాయన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది.

భారత్ లోలా పాకిస్తాన్ ప్రజలు నోటు కష్టాలు భరిస్తారా అన్నది కష్టమే. ఎందుకంటే ఇండియాలో లాగే అక్కడి ప్రజలు కష్టాలు పడుతూ కూడా నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించకపోవచ్చు. అసలే శాంతిభద్రతలు అక్కడ అంతంత మాత్రమే. అలాంటిది ప్రజలంతా బ్యాంకులు, ఏటీఎంల దగ్గరకొస్తే తట్టుకునేంత శక్తి వారికి ఉంటుందా అన్నది కూడా అనుమానమే. మరి ఈ నోట్ల రద్దు నిర్ణయం వరకు ఓకే గానీ… దాని తర్వాతి పరిణామాలపై ఇప్పట్నుంచే పాక్ సర్కార్ పక్కా ప్రణాళిక వేస్తే సరి.. లేకపోతే పాక్ లో అల్లకల్లోలం తప్పకపోవచ్చంటున్నారు విశ్లేషకులు.