పన్నీర్ ఆపరేషన్ సక్సెస్..పేషెంట్ సీరియస్?

Posted February 13, 2017

panneer selvam success but cant become cm
జయ సమాధి వద్ద మౌన దీక్షతో శశికళ మీద యుద్ధం మొదలెట్టారు పన్నీర్ సెల్వం.ఆయన యుద్ధం మొదలెట్టి శరపరంపరగా శశికళ మీద ఎన్నో అస్త్రాలు సంధించారు.ఆ అస్త్రాలన్నీ భలేగా పేలాయని మీడియా కోడై కూసింది.అది నమ్మి పన్నీర్ ఇంటి ఎదుట అన్నాడీఎంకే శ్రేణులు క్యూ కట్టాయి. పన్నీర్ లోని సరికొత్త కోణాన్ని చూస్తూ సంతోషపడిపోయాయి.ఇక ఆ పార్టీ ఎంపీ లు కూడా పన్నీర్ ఇంటిదారి పట్టారు.ఇక రాజ్ భవన్ బయటికి చెప్పకపోయినా పన్నీర్ అడక్కుండానే కావాల్సినంత గడువు ఇచ్చింది.ఇంత జరిగి వారమైంది.అంతా పన్నీర్ కి అనుకూలమని డంకా భజాయించేవాళ్లే.కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ కండిషన్ సీరియస్ అన్నట్టు తయారైంది పరిస్థితి.

జయ సమాధి సాక్షిగా రాజకీయ సమరభేరి మోగించిన పన్నీర్ ఈ వారం రోజుల్లో కేవలం 8 మంది ఎమ్మెల్యేల్ని మాత్రమే ఆకట్టుకోగలిగారు.ఎంపీ లు వస్తున్నారని అంటున్నా..అది చెప్పుకోడానికే పనికొస్తుంది.ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన ఎమ్మెల్యేల్ని శశి హస్తాల నుంచి బయటకు రప్పించలేకపోయారు పన్నీర్.ఆయన్ని నమ్ముకుని రాజకీయ పాచిక విసిరిన బీజేపీ ఇప్పటికే చెడ్డ పేరు మూటకట్టుకోవడం తప్ప సాధించింది ఏమీ లేదు.పరిస్థితి చేయి దాటిపోతోంది.శశికళని ప్రభుత్వ ఏర్పాటుకి 24 గంటల్లో ఆహ్వానించేలా రాజ్ భవన్ కి ఆదేశాలు ఇవ్వాలని ఆమె తరపున తాజాగా మద్రాస్ హై కోర్ట్,సుప్రీమ్ కోర్ట్ ల్లో పిటీషన్ దాఖలైంది.తాజా పిటీషన్ తో కేంద్రం,గవర్నర్ మీద కూడా ఒత్తిడి పెరిగింది.పన్నీర్ పరిస్థితి చూస్తుంటే ఎంత గడువు ఇచ్చినా ఎమ్మెల్యేల్ని ఆకట్టుకునే వాతావరణం కనిపించడం లేదు.పన్నీర్ తీరుతో బీజేపీ పరిస్థితి సైతం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ సీరియస్ లాగానే తయారైంది.