పన్నీరా మజాకా..?

Posted April 21, 2017 at 10:10

panneerselvam demand then palaniswamy shockedకేంద్రం మద్దతిచ్చినా సీఎం కాలేకపోయిన పన్నీర్ ను అందరూ కూరలో కరివేపాకులా తీసిపడేశారు. కానీ కోటిన్నర మంది ఏఐడీఎంకే కార్యకర్తల్లో ఆయనకు ఉన్న పట్టును ఎవరూ కాదనలేకపోతున్నారు. నిజంగా పన్నీర్ అసమర్ధుడైతే.. అంతమంది ఎంపీలు ఆయన వైపు ఎందుకుంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక ఎమ్మల్యేలంటారా.. కువ్వత్తూర్ రిసార్ట్ మత్తు దిగిందాకా అంతే ఉంటారనేది పన్నీర్ వర్గం ఆలోచన. నిజంగా జనంలో పళనిస్వామికి పలుకుబడి ఉంటే.. ఒక్క ఆర్కేనగర్ ఉపఎన్నిక కోసం డబ్బులు పంచాల్సిన అవసరమే లేదు.

అసలు పళనిస్వామి కుర్చీ ఎక్కిన దగ్గర్నుంచీ ఆయనకు ఊపిరాడటం లేదు. ఓ అధికారితో పనిచేయించలేకపోతున్నారు. కనీసం ముఖ్యమంత్రిగా దర్జా అనుభవించలేకపోతున్నారు. ప్రమాణ స్వీకారం దగ్గర్నుంచీ ఎడతెరిపి లేకుండా సాగుతున్న ఐటీ దాడులు ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. మూడు దశాబ్దాలుగా అమ్మ నీడన చల్లగా బతికిన పళని బ్యాచ్.. రెండు నెలల్లో ఐటీకి తమ అవినీతి ఆధారాలన్నీ సమర్పించుకుని గుండెలు అరచేతిలో పెట్టుకుని బతుకుతోంది. పన్నీర్ వర్గం నుంచి వస్తున్న లీకుల ప్రకారం.. సీఎం సహా నలుగురు సీనియర్ మంత్రుల చిట్టా ఐటీ దగ్గర రెడీగా ఉంది.

టీటీవీ దినకరన్ అరెస్ట్ ఫస్ట్ స్టెప్పే అంటున్నారు. ఆయన అరెస్టయ్యాక కూడా దారికిరాకపోతే.. ఇక క్యాబినెట్లో అరెస్టుల పర్వానికి తెరలేస్తుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన తప్పదు. పళనికి రాజకీయ సమాధి తప్పదు. అందుకే సీఎంకి గుండె దడగా ఉంది. అటు చూస్తే పన్నీర్ మెట్టు దిగడం లేదు. ఇప్పటిదాకా శశికళ బహిష్కరణ, జయ మృతిపై ఎంక్వైరీ, పోయెస్ గార్డెన్ స్మారక భవనం చేయడం, పార్టీని, ప్రభుత్వాన్ని పన్నీర్ కు హ్యాండోవర్ చేయడంతో పాటు కొత్తగా కేంద్ర క్యాబినెట్లో చేరడానికి షరతులు పెట్టింది. వీటికి ఒప్పుకుంటనే చర్చలు మొదలెట్టాలని అల్టిమేటం ఇచ్చింది. దీంతో పళని గుండెల్లో రాయి పడింది.