కాడి పడెయ్యని పన్నీర్ …సోషల్ మీడియా వార్

Posted February 17, 2017

panneerselvam fight on palanisamy and sasikala in social media
ప్రేమలో,యుద్ధంలో,రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.ఆ విషయాన్ని బాగా నమ్మినట్టు వున్నాడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.అందుకే శశికళతో సాగిన జయ రాజకీయ వారసత్వ పోరులో ప్రస్తుతానికి ఓడిపోయినా ఆయన కాడి కింద పారేయలేదు.సీఎం గా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేసాక కుంగిపోతాడనుకున్న పన్నీర్ నేరుగా జయ సమాధి వద్దకు వెళ్లారు.ఆమె ఆశయాలకు వ్యతిరేకంగా శశికళ కుటుంబం చేతుల్లోకి అన్నాడీఎంకే ని పోనివ్వబోనని పన్నీర్ శపధం చేశారు.శశి ఆడుతున్న రాజకీయ చదరంగంలో పావులైన ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచాలని పన్నీర్ నిర్ణయించుకున్నారు.అందుకు కారణం లేకపోలేదు.అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో శశికి వున్న బలం ప్రజల్లో లేదని తాను సీఎం గా వున్నప్పుడు ఇంటలిజెన్స్ ఇచ్చిన నివేదికల ఆధారంగా భవిష్యత్ పోరాటానికి పన్నీర్ వ్యూహరచన చేస్తున్నాడు.

పళనిస్వామికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు. అదే టైం లో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని శశి,పళనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని యువతకి పన్నీర్ పిలుపు ఇస్తున్నారు.జల్లికట్టు ఉద్యమాన్ని ఆయన ప్రస్తావిస్తూ యువతని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు.యూత్ ముందుకొస్తే ఎమ్మెల్యేలు సైతం పునరాలోచనలో పడక తప్పదని పన్నీర్ భావిస్తున్నారు.ప్రస్తుత రాజకీయ వాతావరణంలో పన్నీర్ ప్రయత్నాలు చూస్తే ప్రాక్టీకాలిటీ కి దగ్గరగా లేదని అనిపిస్తోంది.అయినా ఒక్క విషయం పన్నీర్ కి అనుకూలంగా వుంది.అదే …ప్రజల్లో శశికళ పట్ల సానుకూలత లేకపోవడం.ఆ అగ్నిపర్వతం బద్దలయ్యేదాకా పన్నీర్ పోరాడగలిగితే ఎంతోకొంత ప్రయోజనం ఉండొచ్చు.గెలుపు దక్కకపోయినా కనీసం పోరాట యోధుడిగా నిలవడం గౌరవాన్ని పెంచే విషయం.కుర్చీ పోగానే కాడి కింద పడెయ్యకుండా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నందుకు పన్నీర్ ని అభినందించాల్సిందే.