చంద్రబాబు అస్త్రమే పవన్ ఆయుధమా?

   pawan kalyan special status speech chandrababu weapon
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా …ఈ అంశం పైకి కాంగ్రెస్,వైసీపీలకు అస్త్రంగా కనిపిస్తోంది.కానీ నిజానికి అది ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో అస్త్రం.రైతు రుణ మాఫీ సహా వివిధ అంశాల్లో ఇచ్చిన హామీల్ని బాబు పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేకపోయినా ప్రజలు భరించడానికి ఒకే ఒక్క కారణం కేంద్రం సహకరించడం లేదన్న అభిప్రాయం.ఆ విషయాన్ని గణాంకాలతో ఎన్ని రకాలుగా చెప్పినా సామాన్యులకి అర్ధం కాదు.కానీ చూశారా ప్రత్యేకహోదా ఇస్తానన్న కేంద్రం ఇవ్వడంలేదంటే జనానికి ఎక్కుతుంది.ఈ విషయంలో తెలిసో తెలియకో కాంగ్రెస్,వైసీపీ హోదా సెంటిమెంట్ రగిలించి బాబు చేతిలో పెట్టాయి.అంతకు ముందు కేంద్రంతో ఆచితూచి మాట్లాడిన బాబు హోదా అస్త్రం పక్వానికి వచ్చాక స్వరం పెంచారు.అందుకే కేంద్రం ఎన్ని లెక్కలు చెబుతున్నా జనం పట్టించుకోవడం లేదు.కళ్ల ముందు సమస్యలు కనిపిస్తున్నా తప్పంతా కేంద్రానిదే అంటున్నారు.

తిరుపతి సభలో పవన్ ప్రత్యేకహోదా అంశాన్నే ప్రస్తావించవచ్చని ఈనాడు లాంటి పత్రిక కూడా భావిస్తోంది.నిజంగా పవన్ అదే అంశాన్ని రాజకీయ ఆయుధంగా మలుచుకునే అవకాశాలు లేకపోలేదు.కేంద్రం మీద పోరాటానికి జనసేన ఇదే ఆయుధాన్ని ప్రయోగిస్తే …జయాపజయాల మాట ఎలావున్నా చంద్రబాబు చేతిలో అస్త్రం మాయమైపోయినట్టే.ఒక వేళ ఈ విషయంలో పవన్ విజయం సాధిస్తే క్రెడిట్ అంతా జనసేనకు …ఒకవేళ అయన హోదా పోరులో ఓడిపోతే ఆ పాపంలో కేంద్రంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం కూడా భాగమవుతుంది.

మొత్తానికి చంద్రబాబు అస్త్రమే తిరిగితిరిగి పవన్ చేతిలో ఆయుధం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.మరో వాదన కూడా వినిపిస్తోంది. కమలనాధులు చంద్రబాబు అస్త్రాన్ని,వ్యూహాన్ని అర్ధం చేసుకునే కౌంటర్ ప్లానింగ్ లో ఉందంట.వీలైతే హోదా,లేకుంటే భారీ ప్యాకేజ్ తో సమస్యని పరిష్కరించి ..ఆ క్రెడిట్ బాబుకి కాకుండా పవన్ కి దక్కేలా చేసి ఆయనతో కలిసి ముందుకెళ్లే అవకాశాల్ని కొట్టిపారేయలేము. ఈ రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించడం హోదా అస్త్రం లేని బాబుకి పెద్ద సవాల్ ..పవన్ కి పదునైన వెపన్.