ఇక స్పీడుగా పోలవరం…

 Posted November 7, 2016

polavaram project speedupపోలవరం ప్రాజక్ట్‌ నిర్మాణ ప్రక్రియ మరింత వేగవంతం చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా అవసరమైన భూసేకరణపై దృష్టిపెట్టింది. నిర్ణీత కాలవ్యవధిని నిర్దేశించుకుని సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలంటూ పశ్చిమగోదావరి కలెక్టర్‌ కాటం నేని భాస్కర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ జోరుగాసాగుతోందని కలెక్టర్‌ సిఎంకు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం 36,754ఎకరాల భూమి అవసరం. కాగా ఇంతవరకు 25,511 ఎకరాల భూమిని సేకరించారు.

పోలవరం మండలంలో అవసరమైన 3,850 ఎకరాల భూ సేకరణ పూర్తి చేశారు. తదుపరి నిర్మాణాల కోసం దీన్ని సిద్దం చేశారు. కుక్కునూరు, ఏలేరుపాడు మండలాల పరిధిలో 7042ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఇందులో 89శాతం ఇప్పటికే పూర్తయింది. కాగా నిర్వాసితులకు పునరావాస సదుపాయాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందుకోసం 1536ఎరాల భూమిని సిద్దం చేస్తోంది. ఇందులో ఇళ్ళు కోల్పోయిన వారందరికీ ఇళ్లతో పాటు మౌలిక వసతులు కల్పిస్తారు. ఈ ప్రాంతంలోనే కళ్యాణమండపాలు, పాఠశాలలు కూడా నిర్మిస్తారు. అలాగే భూమి కోల్పోయిన నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా 9350ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఈ భూసేకరణ కూడా పూర్తవుతోంది.