యంత్రుడు @పోలవరం ..

పోలవరం లాంటి భారీ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే ఆషామాషీ విషయం కాదు.అలాంటి ప్రాజెక్ట్ పనుల్లో ఎంత భారీ యంత్రాలు ఉపయోగిస్తారో మీరే చూడండి…

 polavaram project work use machines

 ప్రాజెక్టుకు గుండె లాంటి స్పిల్‌వే పునాది తవ్వకానికి త్రివేణి ఎర్త్‌ మూవర్స్‌ కంపెనీ ఆస్ట్రేలియా నుంచి అత్యాధునిక ఎక్సావేటర్‌ను, ఆరు డంపర్లను తెప్పించారు. ఎక్సావేటరు పరికరాలను తీసుకురావడానికి రవాణా వ్యయం రూ.4 కోట్లు ఖర్చయిందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. దీని ఖరీదు రూ.70 కోట్లు. విడి భాగాల బిగించడానికి నెల రోజులు పట్టింది.

 polavaram project work use machines

* ఐదు డంపర్లను కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చాయి. ఒక డంపరును ఇప్పటికే బిగించారు. మిగిలిన వాటిని బిగించే పనులు జరుగుతున్నాయి. ఒక్కో డంపరు ఖరీదు రూ.4 కోట్లు. ఈ డంపర్లు తిరగడానికి వీలుగా రహదారులు విశాలంగా ఉండాలి. అలా ఉంటే ఒక ట్రిప్పునకు 245 టన్నుల రాయిని గానీ మట్టిని గానీ సునాయాసంగా స్పిల్‌వే కొండ నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇంకో డంపరు కూడా వస్తుంది.

* కొత్తగా వచ్చినవి కాకుండా ప్రస్తుతం త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ వద్ద 100 టన్నుల సామర్థ్యం కలిగిన డంపర్లు 30, ఎక్సావేటర్లు 17, డ్రిల్లింగ్‌ యంత్రాలు 20 ఉన్నాయి.

* ఈ అన్ని యంత్రాలకు రోజుకు డీజిల్‌కు అయ్యే ఖర్చు రూ.35 లక్షలు. కొత్తగా వచ్చిన ఎక్సావేటర్‌, ఆరు డంపర్లకు రోజుకు 25 వేల లీటర్ల డీజిల్‌ కావాలి. అందుకు రూ.15 లక్షలు అవసరం.

* 2015 నవంబరులో స్పిల్‌వే పునాదుల కోసం ఉన్న కొండను తవ్వే పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకూ 70 లక్షల క్యూబిక్కు మీటర్ల రాయిని తీశారు.

* ప్రస్తుతం రోజుకి 35 నుంచి 40 వేల క్యూబిక్కు మీటర్ల రాయిని తీస్తున్నారు. భారీ యంత్రాలు రాకతో రెట్టింపు పరిమాణంలో రాయిని తీయవచ్చని, మరో మూడు నెలల్లో స్పిల్‌వే పునాది పనులు పూర్తి చేస్తామని కంపెనీ సిబ్బంది భరోసా వ్యక్తం చేస్తున్నారు.
* రెండు అంతస్తుల భవనం ఎత్తులో ఉన్న ఎక్సావేటరు బరువు 670 టన్నులు. ఒక్కసారి 35 క్యూబిక్కు మీటర్ల రాయిని ఎత్తి డంపర్లలో వేస్తుంది. అలా రోజుకు 15 వేల క్యూబిక్కు మీటర్ల రాయిని వేయగలదు.ఇప్పటి వరకూ ప్రాజెక్టు పనుల్లో 6 నుంచి 8 క్యూబిక్కు మీటర్ల రాయి, మట్టిని ఎత్తి పోసే ఎక్సావేటర్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలన్న సీఎం చంద్రబాబు సూచనల మేరకు దీనిని తీసుకొచ్చినట్లు కంపెనీ సిబ్బంది చెప్పారు.

* డ్రైవర్‌ కేబిన్‌లోకి వెళ్లాలంటే ఇంటి డాబాపైకి వెళ్లినట్లే. 30 మెట్లు ఎక్కాలి. యంత్రానికి రెండు ఇంజిన్లు ఉన్నాయి.