తూచ్‌.. సాహో లేదు లేదు!!

Posted April 21, 2017 at 12:30

prabhas sahu teaser postponed because of rajamouli
ప్రభాస్‌ ‘బాహుబలి’ తర్వాత నటించబోతున్న సినిమా ‘సాహో’. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో సుజీత్‌ దర్శకత్వంలో 150 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభంకు ముందే టీజర్‌ను విడుదల చేయాలని నిర్మాతు భావించారు. ‘బాహుబలి’తో పాటు టీజర్‌ను వదలాలని మొదట భావించారు. ఆ విషయాన్ని ప్రభాస్‌ కూడా నిర్థారించాడు. అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం బాహుబలి సినిమా విడుదల అవుతున్న ఈ సమయంలో దృష్టిని సాహో వైపు మరల్చడం మంచిది కాదని రాజమౌళి చెప్పడంతో నిర్మాతలు సాహో టీజర్‌ను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే టీజర్‌ కోసం షూటింగ్‌ జరిపారు. టీజర్‌ ఎడిటింగ్‌ మరియు సౌండ్‌ మిక్కింగ్‌ కూడా అయ్యింది. అయితే ఈ సమయంలో బాహుబలి టీం అడ్డు చెప్పడంతో ప్రభాస్‌ కాస్త వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది. షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత లేదా ‘బాహుబలి’ విడుదలైన కొన్ని రోజుల తర్వాత ‘సాహో’ చిత్ర టీజర్‌ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో కూడా సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే.