ఎస్పీ-కాంగ్రెస్ ను ద‌గ్గ‌ర చేసిన ప్ర‌శాంత్ కిషోర్!!

Posted December 14, 2016

prashanth kishore made congress and sp
ప్ర‌శాంత్ కిషోర్.. దేశంలోని రాజ‌కీయ నాయ‌కులంద‌రి ఫేవ‌రేట్ ఇత‌ను. ఎన్నిక‌ల వ్యూహాల్లో దిట్ట‌. గతంలో న‌రేంద్ర‌మోడీ.. ఈ మ‌ధ్య కాలంలో నితీశ్ కుమార్ కు ఎన్నిక‌ల టైంలో మంచి బూస్ట‌ప్ ఇచ్చారు. బీజేపీ హ‌వా న‌డుస్తున్న త‌రుణంలో బీహార్ లో … ప్ర‌శాంత్ కిశోర్ ఎంట‌రైన త‌ర్వాతే సీన్ మారింది. నితీశ్-లాలూ మ్యాజిక్ పని చేసింది. ఆ టాలెంట్ ను కాంగ్రెస్ హైక‌మాండ్ గుర్తించింది. యూపీ ఎన్నిక‌ల్లో వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిశోర్ ను రంగంలోకి దించింది.

వాస్త‌వానికి యూపీలో కాంగ్రెస్ అంత బ‌లంగా ఏమీ లేదు. అటు ఎస్పీ.. ఇటు బీఎస్పీ… దీనికి తోడు బీజేపీకి సానుకూల ప‌వ‌నాలు.. దీంతో కాంగ్రెస్ ఇక్కడ్నుంచి పెద్ద‌గా ఆశించ‌డం లేదు. రాహుల్, సోనియా ఇక్క‌డ నుంచే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా వారి బ‌లం కూడా వారి నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం. ఇవ‌న్నీ ప‌క్కాగా అంచ‌నా వేసిన ప్రశాంత్ కిశోర్.. ఎస్పీకి గురిపెట్టాడు. ముందు యూపీ సీఎం అఖిలేశ్.. ఆ త‌ర్వాత ములాయంతో మంత‌నాలు జ‌రిపారు. వారిని క‌న్విన్స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. కాంగ్రెస్ తో క‌లిస్తే… ఎస్పీకి కూడా లాభం జ‌రుగుతుంద‌ని మంచి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చార‌ట‌. ప్రశాంత్ ప్ర‌జెంటేష‌న్ అఖిలేశ్ కు తెగ న‌చ్చేసింద‌ట‌. కానీ ములాయంకు న‌చ్చుతుందో లేదో అనుకున్నారు. కానీ ములాయం అయితే అఖిలేశ్ కంటే ఎక్కువ ఇంప్రెస్ అయ్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిందేన‌ని ములాయం గ‌ట్టిగా చెప్పార‌ట‌.

ప్ర‌శాంత్ కిశోర్ యూపీలోకి ఎంట‌ర్ కాక‌ముందు ఎస్పీ… కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధంగా లేదు. కానీ ప్ర‌శాంత్ సీన్ లోకి వ‌చ్చిన త‌ర్వాతే ప‌రిస్థితి మారింది. ఇప్పుడు ఏకంగా పొత్తు దిశ‌గా రెండు పార్టీలు ముందుకు క‌దులుతున్నాయి. బీహార్ లో లాగా ఇక్క‌డా ప్ర‌శాంత్ మ్యాజిక్ చేస్తాడ‌ని రెండు పార్టీలు పెద్ద హోప్స్ పెట్టుకున్నాయి. దీంతో ఉన్నంత‌లో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు ప్ర‌శాంత్ కిశోర్ కూడా ఎత్తుగ‌డ‌లు వేస్తున్నార‌ని చెబుతున్నారు.