ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ కు కారణమేంటి..?

0
130

Posted April 25, 2017 at 17:33

Rajnath Singh pays tribute to CRPF jawans in chhattisgarhఛత్తీస్‌గఢ్‌లోని సుకమా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడి పాశవిక హత్య అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు రాజ్‌నాథ్‌ నివాళులర్పించారు. ఛత్తీస్‌గఢ్‌ చేరుకున్న కేంద్రమంత్రి.. మనా క్యాంప్‌లో ఉన్న జవాన్ల మృతదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇది మావోయిస్టులు నిరాశలో చేసిన క్రూరమైన హత్య అని ఆరోపించారు.

ఇప్పటికే రాష్ట్రప్రభుత్వాలతో కలిసి కేంద్ర బలగాలు జాయింట్ ఆపరేషన్లు చేస్తున్నాయి. అయితే తమ వ్యూహాలకు మరింత పదును పెడతామన్నారు రాజ్ నాథ్. తప్పకుండా జవాన్ల హత్యకు బదులు తీర్చుకుంటామని స్పష్టం చేశారు. అభివృద్ధిని ఆపడం కోసం గిరిజనుల్ని పావులుగా చేసుకుంటున్నారని ఆరోపించారు. మావోయిస్టులు పైకి సమసమాజం కబుర్లు చెబుతూ.. అడవి బిడ్డల్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఆపేస్తున్నారని మండిపడ్డారు రాజ్ నాథ్. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో కేంద్రమంత్రి సమావేశమయ్యారు. అక్కడి నుంచి రామకృష్ణ కేర్‌ ఆసుపత్రికి వెళ్లి మెరుపుదాడిలో గాయపడిన జవాన్లను పరామర్శించారు. ఎన్ కౌంటర్ పై కేంద్రం సీరియస్ గా ఉంది. అసలు అంతమంది మావోయిస్టులు సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ సమీపంలోకి వచ్చినా ఇంటెలిజెన్స్ ఎక్కడ విఫలమైందనే కోణంలో నివేదిక అడిగారు. ప్రతిసారీ మావోయిస్టులు ఎదురుదెబ్బ తీయడాన్ని మోడీ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్ లో ఎలాగైనా నక్సలిజాన్ని అంతమొందించాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ఎలాంటి సాహసోపేత నిర్ణయాలకైనా వెనుకాడేది లేదని అటు మోడీ, ఇటు రాజ్ నాథ్ స్పష్టం చేస్తున్నారు.