పొదుపే లక్ష్యం.. విలీనమే మార్గం

0
50

Posted April 25, 2017 at 17:20

RBI Governor urjit patel says central govt green signals to banks mergerబ్యాంకింగ్ రంగంలో సంచలన నిర్ణయాలు అవసరమనే సంకేతాలను భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ పంపిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలని, ఈ రంగంలో తక్కువ బ్యాంకులు ఉండటం శ్రేయస్కరమని తెలిపారు. నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు ఇది సాయపడుతుందన్నారు. మనకు అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు అవసరమా? అని ప్రశ్నించారు. వీటిని కొద్ది సంఖ్యకు ఏకీకృతం చేయవలసి ఉందన్నారు. ఊర్జిత్ వ్యాఖ్యలతో బ్యాంకింగ్ రంగంలో మరిన్ని విలీనాలు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొన్నేళ్లుగా బ్యాంకులు అధిక అప్పులతో సతమతమౌతున్నాయి. అప్పులు వసూలు కాకపోవడంతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. కొన్నేళ్లుగా కేంద్రం కూడా బ్యాంకులకు ఇచ్చే మూలధనాన్ని తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడైతే పనితీరు ఆధారిత మూలధనం ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో అటు బ్యాంకులు కూడా సంస్కరణ బాట పట్టాయి. సాధ్యమైనంతవరకూ చిన్న బ్యాంకుల్ని విలీనం చేసుకోవడం, రిస్క్ ఫ్రీ రుణాలు ఇవ్వడం ద్వారా తమ నిరర్థక ఆస్తుల్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి.

అటు కేంద్రం కూడా విలీనాల్నే కోరుకుంటోంది. బ్యాంకుల సంఖ్య ఎక్కువైనకొద్దీ నియంత్రణ కష్టమౌతోందని, దీంతో కిందిస్థాయి అధికారుల్లో అవినీతి పెరుగుతుందనే అభిప్రాయం ఉంది. మన దేశానికి ఓ నాలుగు జాతీయ బ్యాంకులు చాలని, కావాలంటే అధిక బ్రాంచీలు పెట్టుకోవచ్చని ఆర్బీఐ కూడా కేంద్రానికి సలహా ఇచ్చింది. దీంతో కేంద్రం కూడా విలీనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో స్టేట్ బ్యాంకుల విలీనం జరగగా.. తర్వాతి దశలో మిగతా బ్యాంకుల్ని కూడా గ్రూపులుగా విడగొట్టి విలీనం చేస్తారని భావిస్తున్నారు.