“రియల్” ఢాం

Posted November 27, 2016

real bombబ్లాక్ మ‌నీని అరిక‌ట్టేందుకు ప్ర‌ధాని మోడీ తీసుకున్న నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో… రియ‌ల్ ఎస్టేట్ రంగంపై పిడుగు పడ్ట‌ట్ట‌య్యింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో రియ‌ల్ ఎస్టేట్ రంగం వాటా 11 శాతం. అలాంటి ప్ర‌ధానమైన రంగం ఇప్పుడు ఒక్క‌సారిగా షాక్ కు గురైంది. తేరుకోవ‌డానికి చాలా కాలం ప‌ట్టొచ్చ‌ని అంచనా.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గ‌త ఏడాది కాలంగా రియ‌ల్ ఎస్టేట్ పీక్ స్టేజ్ లో ఉంది. రెండురాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బిజినెస్ బాగానే న‌డిచింది. షేర్ మార్కెట్ కంటే రియ‌ల్ ఎస్టేట్ కు తిరుగులేద‌ని గ‌ట్టిగా న‌మ్మారంతా. దీంతో ఈ రంగంతో ఎలాంటి సంబంధం లేని వారు కూడా రియ‌ల్ వ్యాపారంలోకి వ‌చ్చేశారు. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేశారు. బాగానే సంపాదించారు కూడా. ఇప్పుడు మోడీ సారు తీసుకున్న నిర్ణ‌యంతో క్ర‌య విక్ర‌యాల‌న్నీ ప‌డిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో రియ‌ల్ వ్యాపారం ఒక్క‌సారిగా సైలైంట్ అయిపోయింది. భూముల‌ను కొనేవారు ముందుకు రావ‌డం లేదు. అమ్ముదామంటే కొనేవారు లేరు. ఇప్ప‌టికే 30 శాతానికి పైగా న‌ష్టం జ‌రిగిందంటున్నారు రియ‌ల్ వ్యాపారులు. ముఖ్యంగా హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు, అపార్ట్ మెంట్ల వ్యాపార‌మంతా ఊహించ‌ని విధంగా రాత్రికి రాత్రే ప‌డిపోయింద‌ని చెబుతున్నారు.

ఏపీలోనూ ప‌రిస్థితి ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేదు. క‌రెన్సీ క‌ష్టాల‌తో అమ‌రావ‌తి, విజ‌య‌వాడ చుట్టూ మార్కెట్ ప‌డిపోయింది. 20 రోజుల ముందు వ‌ర‌కు కోట్లలో ఉన్న భూముల‌వైపు ఎవ‌రూ క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. కోటి మాట అటుంచి దాంట్లో స‌గం రేటుకు ఇస్తామ‌న్నా ఎవ‌రూ కొన‌డానికి ముందుకు రావ‌డం లేదు. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ రియ‌ల్ బిజినెస్ ఢ‌మాల్ అయిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియ‌క రియ‌ల్ వ్యాపారులు బిక్క‌చూపులు చూస్తున్నారు.