చంద్రబాబుకు దగ్గరైపోయిన వైఎస్ సన్నిహితుడు!!

Posted December 20, 2016

saipratap close to chandrababu
వైఎస్ వర్గంతో చంద్రబాబుకు సంబంధాలు ఉండే అవకాశమే లేదు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అలానే వైఎస్ సన్నిహితుడు, ఆయనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన సాయిప్రతాప్ ఇప్పుడు చంద్రబాబుకు బాగా దగ్గరైపోయారు. ఎంతలా అంటే కడప జిల్లాకు సంబంధించిన ఏ విషయమైనా బాబుగారు… సాయిప్రతాప్ ను సంప్రదిస్తున్నారట. చాలా అంశాల్లో ఆయన సలహాలు కూడా తీసుకుంటున్నారని సమాచారం.

సాయి ప్రతాప్ కు అపారమైన రాజకీయ అనుభవముంది. ఆయన ఆరుసార్లు రాజంపేట నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. కేంద్రమంత్రిగానూ పనిచేశారు. రాజంపేట అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ఉంది. పేరుకు వైఎస్ సన్నిహితుడైయినప్పటికీ.. ఆయన ఎప్పుడూ ప్రత్యర్థి పార్టీలను విమర్శించిన దాఖలాలు లేవు. వైఎస్ మెప్పు కోసం ఆరాటపడిన సందర్భాలు అంతకంటే లేవు. రాజకీయాల్లో ఆయనంత మృదుస్వభావి ఉండరని చెబుతారు. ఈ నిజాయితీ వల్లే చంద్రబాబు..ఆయనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారట.

గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ .. రాజంపేటలో సాయిప్రతాప్ కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ సత్తా చాటడం ఏమంత కష్టం కాకపోవచ్చు. వచ్చే ఎలక్షన్స్ లోనూ కేంద్రంలోనూ మోడీ ప్రభుత్వమే వస్తే.. సాయిప్రతాప్ కు మంచి పదవి వచ్చే అవకాశమూ లేకపోలేదంటున్నారు టీడీపీ నాయకులు. అంతలా బాబు గారికి దగ్గరైపోయారట సాయి ప్రతాప్.