చిన్న‌మ్మ కాళ్ల బేరానికొచ్చిందా?

 Posted February 16, 2017

sashikala apologise to central government
కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్న శ‌శిక‌ళ కాళ్ల బేరానికొచ్చిందా? క‌రుణించాల‌ని ఢిల్లీ పెద్ద‌ల‌ను వేడుకుంటుందా? అంటే ఔన‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కేంద్ర‌ప్ర‌భుత్వంతో పెట్టుకోవ‌డం వ‌ల్లే ప‌రిస్థితి ఇక్క‌డిదాకా వ‌చ్చింద‌న్న‌ది శ‌శిక‌ళ వర్గానికి ఇప్పుడు అర్థ‌మైంది. అందుకే ఆల‌స్య‌మైపోయినా చివ‌రి ప్ర‌య‌త్నం చేయాల‌ని భావిస్తోంద‌ట‌.

శ‌శిళ‌కకు నాలుగేళ్ల జైలు శిక్ష ప‌డింది. బెయిల్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా దాదాపుగా మూసుకుపోయాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమె జైల్లో ఉంటే… ఇక త‌మిళ‌నాడులో ఆమె వ‌ర్గం క‌థ ముగిసిపోయిన‌ట్టే. అలా జ‌ర‌గ‌కుండా ప‌ళ‌నిస్వామి సీఎం కావాల‌ని చిన్న‌మ్మ ప్ర‌యత్నిస్తోంది. అందుకే ఢిల్లీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుత‌న్న‌ప‌ట్టు తెలుస్తోంది. కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడుతో తంబిదురై చ‌ర్చ‌లే అందుకు ఉదాహ‌ర‌ణ అని టాక్.

ప‌ళనిస్వామి విష‌యంలో స‌హ‌క‌రించాల‌ని వెంక‌య్య‌ను కోరార‌ట తంబిదురై. ప‌ళ‌నిస్వామి ముఖ్య‌మంత్రి అయితే.. కేంద్రం చెప్పిన‌ట్టే న‌డుచుకుంటామ‌ని మాట‌కూడా ఇచ్చార‌ట‌. కానీ వెంక‌య్య మాత్రం ఆల‌స్యమైపోయింది… ఇదేదో ముందే మేలుకొని ఉంటే బావుండేద‌ని చెప్పార‌ట‌. అయిన‌ప్ప‌టికీ త‌న ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పుకొచ్చార‌ని టాక్. ఇక శ‌శిక‌ళ‌కు కూడా బెయిల్ విష‌యంలోనూ ఏమైనా దారులుంటే చూడాల‌ని తంబిదురై విజ్ఞ‌ప్తి చేసినట్టు వార్త‌లొస్తున్నాయి.

అన‌వ‌స‌రంగా లేనిపోని ఆశ‌లు పెట్టుకొని… ఇప్పుడు నిండా మునిగాక తేరుకుంటే ఏం లాభం? అదేదో ముందే ఢిల్లీ పెద్ద‌ల‌తో కాంప్ర‌మైజ్ అయి ఉంటే … ప‌రిస్థితి వేరే ర‌కంగా ఉండేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. కానీ ఏం లాభం… విధిరాత‌ను ఎవ‌రూ త‌ప్పించ‌లేరు. ముందు ఢీ అన‌డం.. ఆ త‌ర్వాత కాళ్ల బేరానికొచ్చేయ‌డం రాజ‌కీయాల్లో మామూలుగా జ‌రిగేవే..!!