వైస్రాయ్ గుర్తుకొస్తోంది…బాబు టైపు లో శశి స్ట్రాటజీ

Posted February 8, 2017

sashikala strategy same as chandrababu
పన్నీర్ సెల్వం తిరుగుబాటు నేపథ్యంలో తమిళనాట ఎమ్మెల్యేల నెంబర్ ముఖ్యమైపోయింది. పన్నీర్ ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే ఎమ్మెల్యేల బలం తనకే ఉందని నిరూపించుకుంటే చాలని శశి అభిప్రాయపడుతున్నారు.అందుకే మొత్తం 134 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో 130 మంది తన వైపే వున్నారని చెప్పేందుకు శశికళ వర్గం ప్రయత్నిస్తోంది. పన్నీర్ ప్రెస్ మీట్ తర్వాత జరిగిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశానికి ఎంతమంది వచ్చారో బయటికి తెలియదు.అయితే 130 మంది వచ్చారని మీడియాకి లీకులు వచ్చాయి.ఆమెకి అనుకూలంగా వున్న తమిళ మీడియాలోని ఓ వర్గం ఈ అంశాన్ని హైలైట్ చేస్తోంది.అయితే 130 మంది శశి వెనుక ఉన్నారన్నది నిజం కాదని అందరికీ తెలుసు.

ఈ వ్యవహారం చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన ఎన్టీఆర్ పదవీచ్యుతినాటి విషయాలు గుర్తొస్తున్నాయి.అప్పుడు ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసి వైస్రాయ్ హోటల్ లో బాబు వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు వున్నారన్నదానిపై చర్చ సాగేది.ఎలక్ట్రానిక్ మీడియా అప్పట్లో ఇంతగా లేదు కాబట్టి పేపర్ కోసం ఎదురుచూసేవాళ్ళు జనం.బాబు వెంట ఉంటున్న ఎమ్మెల్యేల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నట్టు వార్తలు వచ్చేవి.ఆ వార్తలు చూసి ఎన్టీఆర్ వెంట వున్న మరికొందరు ఎమ్మెల్యేలు బాబు క్యాంపు లో చేరినట్టు కూడా వాదనలు వున్నాయి.ఏదేమైనా నాడు వైస్రాయ్ ఉదంతంలో బాబు స్ట్రాటజీ ఫలించి ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది.ఇప్పుడు శశి కూడా అదే వ్యూహం అమలుచేస్తున్నారు.అయితే క్షణానికో రంగు మారే రాజకీయంలో అప్పటి స్ట్రాటజీ ఏ మాత్రం ఉపయోగపడుతుందో వేచి చూడాలి.