శశికళ మాటలు,వ్యూహాలు ఇవే..

Posted February 8, 2017

sasikala press meet and target o panneerselvamపన్నీర్ సెల్వం తిరుగుబాటు తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తొలిసారిగా నోరు విప్పారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత ఆమె పన్నీర్ మీద మాటల దాడి చేశారు.పార్టీ వ్యతిరేకుల అండతో పన్నీర్ తమని మోసం చేశారని చిన్నమ్మ ఆరోపించారు.ఇంతకుముందు అమ్మని కూడా ఇలాగే మోసం చేయాలని చూస్తే ఆమె పన్నీర్ కుట్రలని తిప్పికొట్టారని శశికళ చెప్పారు.ఇప్పుడు కూడా అన్నాడీఎంకే లో చీలిక రాదని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.మొత్తంగా పన్నీర్ సెల్వం ఓ కుట్రదారు,ద్రోహి,మోసగాడని చిన్నమ్మ అన్నారు.

పార్టీ ఎమ్మెల్యేలంతా తనతోనే ఉన్నట్టు శశికళ వివరించారు.అన్నాడీఎంకే పునాదుల్ని ఎవరూ కదల్చలేరని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.తమిళనాట అన్నాడీఎంకే కి ఎదురు లేదని శశి ధీమా వ్యక్తం చేశారు.జయ బతికున్నప్పుడు ఆమె కోసమే జీవించానని …ఆమె చనిపోయాక ఆమె ఆశయాల సాధన కోసమే జీవిస్తున్నట్టు శశికళ వివరించారు.జయ,తాను జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూశామని …తాజా సమస్యని కూడా దీటుగా ఎదుర్కొంటానని ఆమె తెలిపారు.

పన్నీర్ తిరుగుబాటు తర్వాత ప్రెస్ ముందుకు వచ్చిన శశికళ ముందుగా రాసుకొచ్చిన ప్రకటన చదివారు.అలా రాసిన కంటెంట్ ని అప్పుడప్పుడు ఎమోషనల్ గా డెలివర్ చేసేందుకు శశి ప్రయత్నించారు.శారీరక భాష నింపాదిగా ఉందని చెప్పేందుకు శశి గట్టి ప్రయత్నమే చేశారు గానీ సొంతంగా మాట్లాడడంలో ఆమె ధైర్యం గా వ్యవహరించలేకపోయారు.అలాంటిది మోడీ నేతృత్వంలోని కేంద్రాన్ని ఢీకొట్టేందుకు ఆమె నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.గవర్నర్ వ్యవహారశైలిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలన్న నిర్ణయంతో ఈ విషయం బయటికొచ్చింది.జల్లికట్టు తరహాలో తమిళ్ సెంటి మెంట్ రెచ్చగొట్టి ఈ సంక్షోభం నుంచి బయట పడాలని శశి ప్లాన్ చేస్తున్నారు.