సెల్వం వర్సెస్ చిన్నమ్మ

Posted February 3, 2017

selvam vs chinamma
తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం… అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మధ్య ఆధిపత్య పోరు మొదలైందా ? త్వరలోనే అది తుపాను రూపం దాల్చబోతోందా ?ఇక సెల్వం సారు ఇంటికెళ్లే సమయం ఆసన్నమైందా ?అంటే ఏదైనా జరగొచ్చంటున్నారు అన్నాడీఎంకే క్యాడర్.

ఫిబ్రవరి 24వ తేదీన దివంగత జయలలిత జయంతి. ఆ రోజు నాటికి అమ్మకు స్మారక మందిరాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రూ. 15 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. చెన్నై మెరీనా బీచ్ లో జయ సమాధి దగ్గర ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఇందుకోసం నమూనా చిత్రం సిద్ధం చేసే బాధ్యతను ఓ ప్రైవేట్ ఆర్కిటెక్‌కు అప్పగించారు. ఆ నమూనా చిత్రాలను ప్రజాపనుల శాఖ అధికారులు సేకరించి ఓ కాపీని సీఎంకు, మరో కాపీని శశికళకు పంపించారు. ఇక్కడే అసలు చిక్కొచ్చింది. సెల్వం కొన్ని మార్పులు… అటు చిన్నమ్మ మరికొన్ని మార్పులు సూచించారని టాక్.

పన్నీర్ సెల్వం సీఎం కాబట్టి ఆయన చెప్పినట్టే ప్రజాపనుల శాఖ పనులు చేస్తోందట. కానీ ఈలోపే పోయెస్ గార్డెన్ నుంచి వారికి వేరే రకమైన ఆదేశాలొచ్చాయట. తాను చేసిన మార్పులకు అనుగుణంగానే అమ్మ స్మారక మందిరం నిర్మాణం కావాలని అధికారులకు చిన్నమ్మ గట్టిగానే చెప్పారని టాక్. దీంతో విషయం ముఖ్య‌మంత్రి దగ్గరకు వెళ్లింది. ఈ స్మారకం పనులు ప్రభుత్వ కనుసన్నల్లో జరగాల్సిందేనని అధికారులకు ఆయ‌న‌ గట్టిగా క్లాస్ తీసుకున్నారట. అటు చిన్నమ్మ.. ఇటు సీఎం.. ఇద్దరితో వేగలేమంటూ అధికారులు చేతులెత్తేశారట. దీంతో స్మారక మందిరం నమూనా చిత్రం దగ్గరే ఆగిపోయిందట.

మొత్తానికి రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అంటుండంతో ఏం జరుగుతుందోనని అన్నాడీఎంకే క్యాడర్ ఆందోళన చెందుతున్నారు. ఈ స్మారకం లొల్లి ముదిరి సీఎం సారు సీటుకు ఎసరు తెస్తుందా అన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందన్న ఊహాగానాలను ఇప్పటిదాకా ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఈ ఇష్యూతో ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని స్పష్టంగా బ‌హిర్గ‌త‌మైంది. ఇది కచ్చితంగా చాలా దూరం వెళ్లొచ్చన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే అన్నాడీఎంకే క్యాడ‌ర్ మాత్రం ఇద్ద‌రి మ‌ధ్య వివాదంతో అమ్మ స్మార‌కం డైలామాలో ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 24న అమ్మ జ‌యంతి నాటికి స్మార‌కం నిర్మాణం జ‌ర‌గ‌డం క‌ష్ట‌మేనంటున్నారు.