కల చెదిరింది..కథ మారింది!!

Posted February 7, 2017

seshikala case in court
తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్న శశికళకు గట్టి షాక్ తగిలింది. ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందే ఢిల్లీ దెబ్బ ఏంటో అర్థమైంది. అంతా సిద్ధమైపోయింది…ఇక సీటెక్కడమే ఆలస్యమని అనుకుంటున్న తరుణంలో అక్రమాస్తుల కేసు తీర్పు వస్తుందన్న ఊహాగానాలతో అంతా తారుమారైపోయింది.

మరో వారం రోజుల్లో అక్రమాస్తుల కేసులో తీర్పు రానుంది. ఈ కేసులో తీర్పు ఒకవేళ వ్యతిరేకంగా వస్తే… చిన్నమ్మకు కష్టకాలమే. జైలుకెళ్లక తప్పదు. రాజకీయ భవితవ్యమే లేకుండా పోతుంది. తీర్పు నేపథ్యంలో కేంద్రం కూడా ఆచి చూచి అడుగులేస్తోంది. వారం రోజుల పాటు వెయిట్ చేయడమే బెటరనే ఆలోచనలో కేంద్రపెద్దలున్నట్టు సమాచారం. అందుకే గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై టూర్ ఖరారు కాలేదని టాక్.

నిజానికి అక్రమాస్తుల కేసు చిన్నమ్మను చాలా రోజుల నుంచి వెంటాడుతున్నా.. తీర్పు సమయం ఇంత త్వరగా వస్తుందని ఆమె ఊహించలేదు. జయ మరణం నేపథ్యంలో కేసు ఇంకా ఆలస్యమవుతుందేమోనని అంచనా వేసింది. కానీ జయ మరణం తర్వాత సీఎం పీఠంపై చిన్నమ్మ ఆశపడడం… అందుకు తగ్గట్టుగా పావులు కదపడం వేగంగా జరిగిపోయాయి. సరిగ్గా ఆమె సీఎం కావాలని అనుకుంటున్న తరుణంలోనే ఆ తీర్పు టైం రావడం … చిన్నమ్మకు మింగుడు పడడం లేదు.

ఇది వాంటెడ్ గా జరిగిందో… కాకతాళీయమో శశికళకు అర్థం కావడం లేదు. ఏదేమైనా ఢిల్లీకి ఎదురువెళ్తే ఎంత ముప్పో శశికి ఇప్పుడు బాగా అర్థమైంది. ఇది కచ్చితంగా చిన్నమ్మ స్వయంకృతాపరాధమేనంటున్నారు పరిశీలకులు. అయితే ఇన్నాళ్లూ చిన్నమ్మ నామస్మరణ చేసిన అన్నాడీఎంకే నాయకులంతా ఇప్పుడు షాక్ లో ఉన్నారట!!