కొత్త పార్టీపై వెనక్కు తగ్గిన శివపాల్

Posted February 3, 2017

shivapal compromise with his son
యూపీ ఎలక్షన్స్ దగ్గరపడే కొద్దీ ఎస్పీ పాలిటిక్స్ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ములాయం ఎప్పుడు తనయుడు అఖిలేశ్ ను పొగడుతారో.. ఎప్పుడు వ్యతిరేకిస్తున్నారో తెలియడం లేదు. ఇక బాబాయ్ శివపాల్ అయితే మరో అడుగు ముందుకేసి సొంత పార్టీ పెట్టేస్తానని ప్రకటించారు. ములాయం కూడా తమ్ముడి వెంటే నడుస్తారన్న వాదన వినిపించింది. మళ్లీ ఏం జరిగిందో కానీ అఖిలేశ్ కు జై కొట్టారు పెద్దాయన.

సొంత అన్న అండగా ఉండడంతో శివపాల్ కొత్త పార్టీ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నారట. ఎన్నికల హడావుడిలో తగిన సమయం లేకపోవడంతో… ఎలక్షన్ తర్వాత కొత్త పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేశారట. పార్టీ పేరు, సింబల్ పైనా కసరత్తు జరిగిందట. అంతా సిద్ధమైపోయింది అనుకున్న తరుణంలో చావు కబురు చల్లగా చెప్పారు ములాయం. ఎంతైనా అఖిలేశ్ నా కొడుకేగా అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎన్నికల్లో ప్రచారం చేయబోనని శపథం చేసిన పెద్దాయన.. ఇప్పుడు ప్రచారం చేయడానికి రెడీ అయిపోయారు.

ములాయం ఇంత పెద్ద షాకిస్తారని శివపాల్ కలలో కూడా ఊహించలేదట. అన్నతో కలిసి అఖిలేశ్ కు కౌంటరిద్దామంటే ఇలా జరిగిందేంటి అని ఫీలైపోతున్నారట. అన్నను నమ్ముకొని అంతా సిద్ధం చేసుకుంటే.. ఇలా యూటర్న్ తీసుకోవడం శివపాల్ కు మింగుడు పడడం లేదు. దీంతో ఆయన కుటుంబసభ్యుల సలహా మేరకు ఇక పార్టీని క్యాన్సిల్ చేసుకోబోతున్నార‌ని స‌మాచారం. అనవసరంగా పార్టీ పెట్టి…కష్టాలు కొని తెచ్చుకోవడం కంటే.. అఖిలేశ్ తో దోస్తీయే బెటరని ఇప్పుడు శివపాల్ ఆలోచిస్తున్నారట. త్వరలోనే బాబాయ్ కూడా అఖిలేశ్ తో భేటీ కానున్నారని సమాచారం. దీంతో ఈ వివాదం ఇప్పుడు సద్దుమణిగినట్టేనని ఎస్పీ కార్యకర్తలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక పార్టీకి తిరుగులేద‌ని రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు.