కొరివితో తల గోక్కుంటున్న సిద్ధరామయ్య

0
47

Posted April 23, 2017 at 11:47

sidhiramayya insulted ias officerఆయన గనుల లాబీపై ఉక్కుపిడికిలి బిగించారు. బళ్లారి పాదయాత్రతో కర్ణాటకలో హస్తానికి పట్టాభిషేకం చేశారు. యడ్యూరప్ప లాంటి బలమైన నేతను గద్దె దించారు. తర్వాత సోనియా ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యారు. జనతాదళ్ నుంచి కాంగ్రెస్ లో చేరినా.. సంవత్సర కాలంలోనే సీఎం అయి, హస్తం నేతలకు ఈర్ష్య కలిగించారు ఆయనే సిద్ధరామయ్య. సింప్లిసిటీకి మారుపేరుగా చెప్పుకునే సిద్ధరామయ్య.. ఏడాదిన్నర కాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆయన వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

మొన్నటికి మొన్న ఓ ఎన్నారై నుంచి లక్షలు విలువ చేసే గడియారం గిఫ్ట్ తీసుకున్న సిద్ధరామయ్య.. సోనియా క్లాస్ పీకడంతో తిరిగిచ్చేశారు. ఈ వాచ్ పై రేగిన వివాదం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అందరూ చూస్తుండగానే.. ఓ ఐపీఎస్ స్థాయి అధికారిని యూజ్ లెస్ ఫెలో అనడంతో.. సిద్ధరామయ్యకు నోటిదూల కూడా బాగా పెరిగిందని జనంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీఎంగా అందరూ గౌరవం ఇచ్చే విధంగా ప్రవర్తించాల్సిన సిద్ధరామయ్య నోరు జారడం.. కాంగ్రెస్ క్యాడర్ కూ మింగుడు పడటం లేదు.

ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంపై కావల్సినంత అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా యడ్యూరప్ప సీఎం అవుతారని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సీఎంకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఎన్నికల్లో ఎలా గెలవాలా అనే వ్యూహాలకు పదును పెట్టడం మానేసి.. తన హోదా చూపించుకోవడానికి నోరు పారేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఖరి అహంకారానికి నిదర్శనమని ప్రతిపక్షాలు అంటుంటే.. ఈయన ఇలాగే ఉంటే ఓటమి ఖాయమని కాంగ్రెస్ నేతలు ఫిక్సవుతున్నారు.