సింహాచలం క్షేత్ర చరిత్ర:

0
63

Posted March 20, 2017

Simhachalam pilgrim center historyభారతదేశంలో 32 నరసింహ క్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్ నందు సింహాచలంలో గల శ్రీవరాహలక్ష్మీనృసింహ క్షేత్రం అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రము విశాఖపట్నమునకు 16 కిలోమీటర్లు దూరంలో సింహగిరిపై 800 అడుగుల ఎత్తున సుజల, సుఫల, సస్యశ్యామల ప్రశాంత వాతావరణంలో నిర్మించబడిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహ క్షేత్రం నెలకొని ఉంది.

ఆంధ్రదేశంలో దివ్య నారసింహ క్షేత్రాలు నాలుగు 1.సింహచలం 2.కృతశౌచం 3.హరపాపం 4.ఆహోబిలం. ఈ దివ్య క్షేత్రములలో ఒక్కొక్క విధంగా హరినామ సంకీర్తనపరుడు హరి భక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుల హరిభక్తి నుండి వేరుచేయుటకు తండ్రి రాక్షసరాజైన హిరణ్యకశివుడు కుమారుడిని అనేక విధములుగా హింసించసాగెను. దీనిలో భాగముగా విశాఖ పూర్వ సముద్రములో భక్త ప్రహ్లాదుని పడవైచి, ఒక పర్వత రాజమును అతనిపై బడవేసెను. అప్పుడు భక్త ప్రహ్లాదుడు శ్రీ మన్నారాయుణుని ప్రార్దించగా, అనుగ్రహించి, పర్వతమును తొలగించి ప్రహ్లాదుని రక్షించెను. విహంగ వీక్షణములో ఆ పర్వతం సింహాకారముగా కనిపించుటచే ఈ క్షేత్రమునకు సింహాచలం అని పేరు వచ్చినట్లు ప్రతీతి. కృతశైచంలో వెలసిన నారసింహుని దర్శిస్తే, అశుచిపోయి కృత కృత్యులగుదురు. ఆ కారణముచే ఈ క్షేత్రమును “కృతశౌచము” అని పేరు వచ్చినది. హరంపాపంలో వెలసిన నారసింహుని దర్శిస్తే పాపములు హరిస్తాడు. అందుచే ఈ క్షేత్రానికి “హరంపాపం” అంటారు. ఆహోబిలంలో నారసింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించాడు. శ్రీ హరి మహా బలవంతుడు, పర్వతమువలెయున్న హిరణ్యకశిపుని అవలీలగా పైకి ఎత్తి తన తొడలపై పరుండబెట్టుకొని వాడి గల గోళ్ళతో హిరణ్యకశిపుని పొట్టచీల్చి చంపుతున్నప్పుడు అచ్చటయున్న భక్తులు నారసింహుని “ఆహో ఎంత బలవంతుడో” అన్నారట. అందుచేత ఈ క్షేత్రానికి “ఆహోబలం” అని పేరు వచ్చింది.

హిరణ్యకశిపుని సంహారానంతరం భక్తప్రహ్లాదుడు శ్రీ హరిని, తన పిన తండ్రిని చంపిన వరాహ అవతారం తన తండ్రిని నారసింహావతారం కలయికతో శాంతమూర్తిగా దర్శన భాగ్యం కల్పించమని ప్రార్ధించాడు. అంతట శ్రీ హరి తాను సింహాచలం క్షేత్రమున వెలయుదునని, ప్రహ్లాదుని కొంతకాలం ఆహోబల క్షేత్రమున తనని పూజించుచూ, కొంతకాలం తరువాత కుమారునికి అప్పగించి, సింహాచలం వెళ్ళి కోరిన వరాహనృసింహావతార కలయికతో యున్న రూపము దర్శించి పూజించవలసినదిగా ఆజ్ఞాపించాడు శ్రీ హరి. ఆ ప్రకారము ప్రహ్లాదుడు ఆహోబలం క్షేత్రమున నారసింహుని భక్తిశ్రద్దలతో కొంతకాలం పూజించి, తర్వాత భాద్యతలు కుమారునికి అప్పచెప్పి సింహాచలం క్షేత్రమునకు వచ్చి, సింహగిరిపై వెలసిన వరాహనృసింహుని దర్శించి పూజా కార్యక్రమములు నిర్వర్తించి, ధన్యుడయ్యెను. ప్రహ్లాదుడు కోరిన మేరకు సింహాద్రినాధునిలో మొఖం వరాహానిది, శరీరభాగం నరుడుది, వాలం (తోక) సింహానిది. రూపంలో స్వామి వరాహనరసింహుడైన, శ్రీవరాహలక్ష్మీ నరసింహుడని వ్వవహరించేదరు. ప్రహ్లాదుని అనంతరం స్వామిని పూజోంచువారు లేక స్వామి మరుగునపడి, స్వామిపై పెద్ద పుట్ట వెలిసినది.కొంతకాలం తరువాత షట్ చక్రవర్తులలో ఒకరైన పూరూరవ చక్రవర్తి ఊర్వశితో కలసి సింహగిరిపై విహరించుటకు విచ్చేసి ఒకనాటి రాత్రి కలలో నృసింహస్వామిని గాంచెను. స్వామి పూరూరవునితో తానున్న ప్రదేశమును తెలుపుడు చేసి, పుట్పను తొలగించి ఆలయ ప్రతిష్ఠ చేయవలసినదిగా ఆజ్ఞాపించెను. పూరూరవుడు తక్షణమే మేల్కొని స్వామి తెలియజేసిన ప్రకారము ఆ ప్రదేశమునకు చేరి, ఒక మాలతి నికుంజ ప్రాంతమున వల్మీకము (పుట్ట)ను గని తక్షణమే ఆ పుట్టను తొలగించి వరాహనృసింహుని దర్శించెను. ఆ రోజు వైశాఖ శక్ల తృతీయ (అక్షయ తృతీయ) భక్తులకు 364 (దర్శనముకు వీలుగా) రోజులుగా పుట్టకు బదులు తనపై పుట్టమట్టిని సమానతూకముగల చందనము పూయవలసినదిగానూ ఒక్క దినము అనగా వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రము (స్వామి వారు ఆర్భించినరోజు) స్వామి నిజరూప దర్శనము భక్తులకు కలుగజేయవలసినదిగా ఆజ్ఞాపించెను.

ఆ ప్రకారము ఆనాటి నుండి నేటి వరకు స్వామి 364 రోజులు సుగంధ పరిమళ భరిత చందనముతో కప్పబడి, ఒక్క దినము అనగా వైశాఖ శుద్ధ తదియ నాడు నిజరూప దర్శనం భక్తులకు లభించుచున్నది. ఈ నిజ‌‌రూప దర్శనం చేయు రోజు చందనయాత్ర అనియు, లేక చందనోత్సవము అని పిలుచుదురు. భక్త ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం త్వరితగతిని భూలోకానికి వచ్చినప్పుడు వేగము వలన జారిన వస్త్రమును ఒక చేతితో పట్టుకొని వేగానికి అలసిన గరుత్మంతునికి మరియొక చేతి బొటన వేలితో అమృత పాయశం చేయిస్తూ ఇంకా వేగము చాలక ఒక మారు ఆకాశం నుండి సింహగిరిపైకి ఉరికి ప్రహ్లాదుని రక్షించినట్లు చెబుతుంది క్షేత్ర మహత్యం.ఒక మారు సింహగిరిపైకి ఉరికినంతనే స్వామి వారి శ్రీపాదములు పాతలములోకి చొచ్చుకొనిపోయి, చందనయాత్ర నాటి నిజరూపాన్ని చూచినప్పుడు స్వామి శ్రీపొద దర్శనం లభించదు. పాతాలవాసులకే స్వామి శ్రీచరణ దర్శన భాగ్యమని క్షేత్రమహాత్మ్యము. ఈ క్షేత్రమును జరుగు ఉత్సవములన్నిటిలోను ఈ చందనోత్సవం ఎక్కువ ప్రాముఖ్యత గలిగినదిగా పరిగణింతురు. ఈ దినమున సింహగిరికి దేవాలయానికి ఏదో చెప్పలేని కళ వస్తుంది. దేవాలయం పరిసరములు శోభాయమానంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇంతటి పవిత్రమైన ఈ దినమున లక్ష్మీ సమేతుడైన వరాహ నృసింహుని నిజ స్వరూపం గావించిన భక్తులు, స్వామి కరుణాకటాక్ష వీక్షణాలు పొందుతారనే నమ్మకం కలదు. ఈ అక్షయ తృతియ నాడు దేశంలోని లక్షలాది మంది భక్తులకు స్వామి నిజరూప దర్శనము లభించును. అదే రోజు రాత్రి శ్రీస్వామి వారికి 108 కలశలతో సహస్రఘట్టాభిషేకం జరుపబడును. మరునాడు యధావిదిగా శ్రీ స్వామి వారి దర్శనములు భక్తులకు లభించును. కావున ఈ విషయాన్ని యావన్మంది భక్తులకు తెలియజేయవలసినదిగా కోరడమైనది. “సింహాచలం దేవస్ధానం”