సోము వీర్రాజుకు మొండిచేయేనా?

Posted December 1, 2016

Related image
బీజేపీ అధిష్టానం ఇటీవల రెండు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా నిత్యానందరాయ్ – ఢిల్లీ అధ్యక్షుడిగా మనోజ్ తివారీకి ఛాన్స్ దక్కింది. పనిలో పనిగా ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ ను నియమిస్తారని అంతా ఆశించారు. సోము వీర్రాజు అయితే తన ఎంపిక లాంఛనమేనని బాగానే హోప్స్ పెట్టుకున్నారు. కానీ షరామామూలుగానే హైకమాండ్ మరోసారి నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టింది.

ఏపీలో ప్రస్తుతం కాపులపై ఫోకస్ ఎక్కువగా ఉంది. వీర్రాజు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన పేరు ఎక్కువగా ప్రచారంలో ఉంది. నిజానికి వీర్రాజు ఎంపికపై బీజేపీ నాయకుల నుంచి పెద్దగా అభ్యంతరాలు లేకపోయినప్పటికీ … టీడీపీ వైపు నుంచే అంతా జరుగుతోందని సమాచారం. వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబును టార్గెట్ చేస్తారు వీర్రాజు. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొడతారు. ఇదే ఆయనకు మైనస్ అవుతోంది. నిత్యం తనపై విరుచుకుపడే వీర్రాజుకు ఛాన్స్ ఇవ్వకూడదని బాబు గట్టిగానే ఫిక్స్ అయిపోయారట. తన ఆలోచనను బీజేపీ పెద్దల చెవిలోనూ వేశారట. ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ మాటకు కొంతైనా విలువ ఇవ్వాలి. కాబట్టి వెంకయ్య నాయుడు కూడా సైలైంట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఈ లొల్లి అంతా ఎందుకు… మరోసారి కంభంపాటి హరిబాబుకు ఇవ్వాలని ఆయన లాబీయింగ్ కూడా చేశారట. కానీ ఎందుకనో అది ముందుకు సాగలేదు.

అటు సోము వీర్రాజు.. ఇటు హరిబాబు.. ఇద్దరికీ కాకుండా కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తోందట. కోస్తా నాయకులకు కాకుండా రాయలసీమ నాయకులకు ఇవ్వాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని సమాచారం. అయినప్పటికీ సోము వీర్రాజు మాత్రం చివరి ప్రయత్నం గట్టిగానే చెయ్యాలని డిసైడయ్యారట.