తమిళ రాజకీయాల్ని తేల్చబోతున్న ఆ పావుగంట..

Posted December 27, 2016

tamil politics in 15 minutes
ఓ పావుగంట సమయం తమిళ రాజకీయాల్ని తేల్చబోతుందా ? ఔను ఆ పావు గంట లో ఆ ఇద్దరి మధ్య జరిగిన మాటలు ఇప్పుడు తమిళ రాజకీయాల్ని నిర్దేశించబోతున్నాయి.ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో వేరే చెప్పాలా ? ఒకరు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం …ఇంకొకరు అన్నాడీఎంకే ని శాసించగలుగుతున్న చిన్నమ్మ శశికళ. ఈ నెల 29 న జరగబోయే పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ ఇద్దరు తలపడబోతున్నారన్న వార్తలు జోరుగా వస్తున్న నేపథ్యంలో …అధికార పార్టీ నేతలు,అవినీతి అధికారులు ఐటీ ఉచ్చులో గిలగిలా కొట్టుకుంటున్న వేళ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం పోయెస్ గార్డెన్ కి వెళ్లారు.పావుగంట సేపు శశికళతో చర్చించారు.ఐటీ దాడులు,తాజా రాజకీయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగిందని వార్తలు వస్తున్నా అసలు విషయం వేరే ఉందట.

ఇటీవలే ఢిల్లీ వెళ్లొచ్చిన తమిళ్ సీఎం పన్నీర్ సెల్వం అధికార మార్పిడి విషయంలో అక్కడి పెద్దల మనోగతాన్ని శశికి వివరించినట్టు తెలిసింది.పార్టీ బాధ్యతలతో పాటు సీఎం పగ్గాలు కూడా చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న శశికి ఢిల్లీ సంకేతాలు సానుకూలంగా లేవని పన్నీర్ క్లారిటీ ఇచ్చారంట. అయినా ముందుకెళ్లాలంటే ఆ తర్వాత పరిణామాలకు సిద్ధపడాలని సున్నితంగా హెచ్చరించి వచ్చాడట.దీనిపై శశికళ స్పందన ఏమిటన్నది బయటికి రావడం లేదు.ఏదేమైనా ఆ పావు గంటలో ఆ ఇద్దరు ఏ నిర్ణయానికి వచ్చారన్నదానిపైనే తమిళ రాజకీయాలు మున్ముందు నడవబోతున్నాయి.చూద్దాం …ఆ పావుగంట ఏమి చేస్తుందో?