సీఎం కుర్చీ కదిలిపోతోందా?

Posted December 21, 2016

tamilnadu cm changesతమిళనాడు రాజకీయం రోజుకో టర్న్ తీసుకుంటోంది. జయమరణం తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయినా.. ఆయన ఉండేది కొంతకాలమేనన్న ప్రచారం జరుగుతోంది. పేరుకు సెల్వం సీఎం అయినా.. రైట్స్ అన్నీ చిన్నమ్మ శశికళే దగ్గరే ఉన్నాయని టాక్. దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా… ఆయన చిన్నమ్మను సంప్రదించక తప్పడం లేదట.

ఇటీవల పన్నీర్ సెల్వం .. శశి గురించి ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారట. దీంతో ఈ విషయం తెలుసుకొని శశి వర్గం కూడా పావులు కదుపుతోందని సమాచారం. సాధ్యమైనంత త్వరగా సెల్వం కుర్చీని లాగేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయట. అందులో భాగంగా పార్టీలోని తమ వర్గానితో శశికి అనుకూలంగా తీర్మానాలు చేయిస్తున్నారని టాక్. ముందు ప్రధాన కార్యదర్శిగా శశి నియామకం జరిగేలా చూడాలన్నది ప్లానట. ఆ తర్వాత మెల్లిగా సీఎం ప్లేసులో చిన్నమ్మ వచ్చి చేరిపోయేలా ప్లాన్ జరుగుతోందని చెప్పుకుంటున్నారు.

అన్నాడీఎంకేలో మన్నార్గుడి మాఫియా హవా ఇప్పుడు బాగా నడుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ వారు చెప్పినట్టే వినాలని హుకూం జారీ చేశారట. చిన్నమ్మను ఎలాగైనా సీఎం చేయాలని మన్నార్గుడి మాఫియా కంకణం కట్టుకుందట. త్వరలోనే సెల్వంను తప్పించేందుకు పక్కా స్కెచ్చేశారట. ఏదో ఒక సాకుతో ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించేందుకు ప్లాన్ జరుగుతోందని టాక్. ముందు మంచిగా చెప్తారట. సెల్వం వినకపోతే.. బలవంతంగానైనా కుర్చీ నుంచి దింపేసేందుకు ప్లాన్ జరుగుతోందని అన్నాడీఎంకేలో గుసగుసలాడుకుంటున్నారు.