చెన్నైలో రాజకీయ చదరంగం

Posted April 21, 2017 at 10:05

tamilnadu politics of aiadmk party bjp and Dmkతమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పైకి ఇదంతా ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ వర్గాల కోలాటంగానే కనిపిస్తున్నా.. ఢిల్లీ నుంచి కేంద్రం.. జైలు నుంచి చిన్నమ్మ అసలు వ్యూహకర్తలని తమిళ వర్గాల్లో గుప్పుమంటోంది. ప్రభుత్వం కుప్పకూలకుండా చూడటం, రెండాకుల గుర్తు తమకే దక్కేలా చూసుకోవడానికి అవసరమైతే ఓ అడుగు వెనక్కి వేయాలని శశికళ వర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే పళని వర్గం కూడా దినకరన్ ఫ్యామిలీని దూరం పెట్టామని ప్రకటించింది కానీ.. బహిష్కరించలేదంటున్నారు విశ్లేషకులు.

ఆలస్యంగా అయినా అసలు విషయం గ్రహించిన పన్నీర్.. వారిద్దరి రాజీనామా లేఖలు, ఈసీ అఫిడవిట్ ఉపసంహరణ అంటూ కొత్త మెలికలు పెట్టారు. ఇక్కడ కేంద్రమేమీ తక్కువ తినలేదు. రాష్ట్రపతి పాలన విధించినడం నిమిషం పని. పైగా అవినీతి ఆరోపణలతో ఏకంగా సీఎం కూడా బుక్కైపోయారు. కానీ దీని ద్వారా విపక్ష డీఎంకేకు అయాచిత లబ్ధి కలుగుతుంది. అన్నాడీఎంకే పాలిటిక్స్ తో విసుగెత్తిన తమిళ జనం.. ఈసారి డీఎంకేకు భారీ మెజార్టీ కట్టబెడతారు. దాని వల్ల బీజేపీకి ఒరిగేదేమీ ఉండదు. అందుకే విలీన డ్రామాతో ప్రభుత్వ మద్దతు తీసుకోవాలనేది ఆసలు ఆలోచన.

కానీ జైల్లో చిన్నమ్మ ఊరికే కూర్చోలేదు. దినకరన్ ను కలవకుండా వెనక్కి పంపేసి బయట ఓ ప్రచారానికి తెరతీసిన చిన్నమ్మ.. అంతర్గతంగా తంబిదురై ద్వారా కథ నడిపిస్తున్నారనేది పన్నీర్ అనుమానం. అందుకే సీఎంను దించే ప్రసక్తే లేదని తంబిదురై చాలా కరాఖండిగా చెబుతున్నారు. ఇంతకూ కేంద్రం ఆలోచనేంటి.. పన్నీర్ ను దువ్వుతుందా.. పళనిని దగ్గర చేసుకుంటుందా.. ఏమీ అంతుబట్టడం లేదు. అవసరమైనప్పుడు పిలిచనా రాని ఇంఛార్జ్ గవర్నర్.. ఇప్పుడు ఎలాంటి అవసరం లేకుండానే రాజ్ భవన్ కు చేరుకోవడంతో.. తమిళ సాంబార్ కు మరింత మసాలా యాడైంది.