తెలంగాణలో దోస్తీ… ఏపీలో కుస్తీ

Posted February 8, 2017

tammineni veerabhadram in ap and telangana
తెలుగురాష్ట్రాల్లో సీపీఎం తీరు హాట్ టాపిక్ గా మారింది. ఒక రాష్ట్రంలో ఒక పార్టీతోనేమో దోస్తీ చేస్తూ.. మ‌రో రాష్ట్రంలోనేమో అదే పార్టీపై పోరాటం చేస్తోంది. ఒకే పార్టీ విష‌యంలో ఇలా భిన్నాభిప్రాయాలు ఉండ‌డంతో .. సీపీఎం తీరు ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై సీపీఎం పోరు చేస్తోంది. సీపీఎం నేత త‌మ్మినేని వీర‌భ‌ద్రం.. పాద‌యాత్ర‌తో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ పోరాటానికి తెలంగాణ టీడీపీ మ‌ద్దతు ప్ర‌క‌టించింది. మ‌ద్ద‌తు మాత్ర‌మే కాకుండా… ఆ పోరాటంలో కూడా టీడీపీ నేత‌లు పాల్గొంటున్నారు.

ఇక అదే సీపీఎం… ఏపీలో మాత్రం చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తోంది. ఏదో ఒక అంశంలో అన‌వ‌స‌రంగా అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతూ… విమ‌ర్శ‌ల‌ను కొని తెచ్చుకుంటోంది. అందుకే సామాన్య జ‌నం కూడా అదేంటి…!! తెలంగాణలో టీడీపీని అవ‌స‌రానికి వాడుకుంటూ.. ఏపీలో మాత్రం విమ‌ర్శ‌లు చేయ‌డమేంటి… !! అన్న ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

అస‌లే సీపీఎం ప‌రిస్థితి అంతంత‌మాత్రంగా ఉన్న స‌మ‌యంలో త‌మ్మినేని వీర‌భ‌ద్రం అయితే బ‌లంగా ఉన్న టీడీపీని బాగానే వాడేసుకుంటున్నారు. అంత‌వ‌ర‌కు ఓకే గానీ… ఆ పార్టీ మ‌ద్ద‌తు తీసుకుంటూనే.. అదే టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటీవ‌ల అశ్వారావుపేట‌లో వీర‌భ‌ద్రం పాద‌యాత్ర జ‌రిగింది. ఇందులో టీడీపీ నుంచి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య పాల్గొన్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే స‌మ‌క్షంలోనే అదే పార్టీపై నిప్పులు చెరిగారు వీర‌భ‌ద్రం. దీంతో టీడీపీ ఎమ్మెల్యే ఒక్క‌సారిగా షాకైపోయారు. ఇలాంటి ప‌ద్ద‌తి మంచిది కాద‌ని వీర‌భ‌ద్రంకు సుతిమెత్త‌గానే హెచ్చ‌రించార‌ట‌. ఇలా అయితే టీడీపీ మ‌ద్ద‌తు ఉండ‌ద‌ని స్ప‌ష్టంగా చెప్పేశార‌ట‌. ఏదేమైనా సీపీఎం నేత‌ల తీరు మాత్రం ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. సొంత ఇమేజ్ కోసం ప‌క్క పార్టీల‌తో దోస్తీలు, కుస్తీలతో కాల‌క్షేపం చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.