తెలంగాణలో బేడీల రాజకీయం

0
106

telangana polices arrested to mirchi farmersఓవైపు రైతులకు ఎన్నో స్కీములు ప్రవేశపెడుతున్నామని చెప్పుకుంటున్న తెలంగాణ సర్కారు.. గత నెల్లో జరిగిన ఖమ్మం మిర్చి యార్డు ఘటనతో అభాసు పాలైంది. ఇది చాలదన్నట్లు కేసులు పెట్టిన రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంతో.. ప్రభుత్వం పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. ఇది కొందరు క్షేత్రస్థాయి అధికారుల నిర్వాకమేనని సర్కారు కవర్ చేసినా.. ప్రతిపక్షాలు మాత్రం తమ పని తాము చేసుకుపోయాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో.. న్యాయం జరగకపోగా.. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా అతిథి సత్కారాలు జరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అనూహ్యమైన చిక్కుల్లో పడింది. ఖమ్మం మిర్చి యార్డును ధ్వంసం చేసిన ఘటనలో అరెస్టు చేసిన రైతులను కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకువచ్చారు. ఈ వార్త మీడియాలో ప్రసారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై పలువురు మండిపడ్డారు. కాగా పోలీసులు అరెస్టు చేసిన 10 మంది రైతులకు కండిషనల్ బెయిల్ మంజూరైంది. మరోవైపు రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు స్పందించారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఆఫ్ పొలీస్ ఇబ్బాల్ అన్నారు.

ఖమ్మం మిర్చియార్డు ఘటనలో అరెస్టయిన రైతులను కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో వారి చేతులకు బేడీలు వేసిన ఉదంతంపై పలు రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించింది. ఇద్దరు ఎఆర్ ఎస్సైలు వెంకటేశ్వరరావు పున్నా నాయక్లను సస్పెండ్ చేసింది. ఈ ఉదంతంపై విచారణ కోసం డిసిపి సాయికృష్ణను విచారణాధికారిగా నియమించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన.. ఇప్పుడు ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ చేసినా.. రైతుల మనసులో మాత్రం ఈ ఘటన ఎప్పటికీ గుర్తిండిపోతుందనే ఆశతో ప్రతిపక్షాలున్నాయి.