కోట‌ప్ప‌కొండ‌లో దొంగ‌లు ప‌డ్డారు!!

Posted November 26, 2016

Image result for kotappakonda guntur

ప్ర‌ఖ్యాత శైవ‌క్షేత్రం కోటప్పకొండ.. బ్రహ్మ, రుద్ర, విష్ణు శిఖరాలుగా ప్రసిద్ది చెందింది. రుద్ర శిఖరంపై పాత కోటేశ్వర స్వామి ఆలయం, బ్రహ్మ శిఖరంపై మేథాదక్షిణామూర్తి ఆలయం, విష్ణు శిఖరంపై పాపవిమోచనేశ్వర స్వామి ఆల‌యం ఉన్నాయి. ఈ ఆల‌యంలో రెండు నంది విగ్రహాలు వున్నాయి. అందులో ఒక‌టి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. నెల‌రోజుల క్రిత‌మే అగంతకులు దాన్ని అప‌హ‌రించుకుపోయారు. అయినా ఇప్ప‌టివ‌ర‌కు అది బ‌య‌టప‌డ‌లేదు. ప్రతి నెల ఏకాదశి రోజు భక్తులు పాపవిమో చనేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకాలు చేస్తారు. ఈ మ‌ధ్య ఏకాదశి ఉండటంతో భక్తులు స్వామికి అభిషేకం చేసేందుకు వ‌చ్చారు. అప్పుడు ఆలయంలో నంది విగ్రహం లేకపోవటం గ‌మ‌నించారు. కానీ ఏం లాభం … దొంగ‌త‌నం జ‌రిగి కూడా చాలా రోజులైపోయింది.

పాపవిమోచనేశ్వర స్వామి ఆల‌యం దాదాపు కొండ పైభాగంలో ఉంటుంది. ఇక్క‌డికి వెళ్లేందుకు కాలిబాట కూడా స‌రిగ్గా ఉండ‌దు. అలాంటి చోట కూడా దుండ‌గులు దొంగ‌త‌నం చేశారంటే..దీని వెన‌క పెద్ద కుట్రే ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నందివిగ్ర‌హం చాలా పురాత‌న‌మైన‌ది. పురాతన కాలంలో విగ్రహాల ప్రతిష్ఠ సందర్భంగా బంగారం, విలువైన వస్తువులను ఉంచుతారు. వీటి కోసమే నంది విగ్రహాన్ని తవ్వి తరలించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చోరీ అయిన నంది విగ్ర‌హంపై దుండ‌గులు క‌న్ను చాలా రోజుల నుంచే ఉంది. చోరీకి ముందే వారు నంది విగ్ర‌హం ప‌క్క‌న రాయిని క‌ట్ చేశారు. దీన్ని తీసుకెళ్లి ప‌రీక్షించిన అనంత‌రమే నంది విగ్ర‌హాన్ని ఎత్తుకెళ్లారు. దీని బ‌ట్టి ఈ నంది విగ్ర‌హం విలువ‌ ప్ర‌స్తుత మార్కెట్లో భారీగానే ఉంటుంద‌ని అంచ‌నా. ఏదేమైనా ఇప్ప‌టికైనా పోలీసులు ఇక్క‌డ సెక్యూరిటీని పెంచాలి. లేక‌పోతే కోట‌ప్ప‌కొండనే దుండ‌గులు దోచేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు భ‌క్తులు.