ఆ ఆయుధం అంత చీపా.?

 thupaki very low cost

నయీం, అయూబ్‌ఖాన్‌, జాఫర్‌ పహిల్వాన్‌, నజీర్‌, ఖైసర్‌, భానుకిరణ్‌ ఇలా కొన్ని ముఠాల వారు దందాల కోసం తుపాకీలను వినియోగించారు. వీరు తమ కోసమే కాకుండా అనుచరులకు కూడా ఆయుధాలు సమ కూర్చడంతో నగరంలో ఆయుధాల సంస్కృతి విస్తరించింది. దక్షణాదిలో అనేక గ్రామాల్లో తపంచాల తయారీని ఉపాధిగా ఎంచుకున్నారు. ఆరు తుటాలతో కూడిన తపంచాను ఇక్కడ కేవలం రెండు వేలకు దొరుకుతున్నాయి. వీటిని రహస్య మార్గాల్లో నగరానికి తీసుకొచ్చి ఐదు నుంచి పది వేల రూపాయలకు గ్యాంగ్‌ సభ్యులు విక్రయిస్తున్నారు. నగర శివారుప్రాంతాల్లో ఇవి సులభంగా లభిస్తున్నాయి.

ఇరవై మీటర్ల దూరం నుంచి తపంచాతో కాలిస్తే ఎదుటి వారి శరీరంలో బుల్లెట్‌ దూసుకుపోయేలా తంపచాను రూపొందిస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని ఘోండ్‌ అనే గ్రామంలో తపంచాకు మరింత మెరుగులు దిద్ది అదే రేటుకు అమ్ముతున్నారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ స్ర్కూ ప్రక్రియలో బుల్లెట్‌ రూపొందించి దాన్ని తపంచాకు అనుసంధానం చేయడం వల్ల ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు ఆయుధం చేతిలో ఉండడంతో కొంత మంది ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ట్రాఫిక్‌ ముందకు కదలడం లేదని ఒకరు కాల్పులు చేయగా, రియల్‌ ఎస్టేట్‌ గొడవలను పరిష్కరించుకునేందుకు మరొకరు వీటిని వాడుతున్నారు.

ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో శనివారం కాంగ్రెస్‌ నాయకుడు యాదగిరిపై కాల్పులు జరగడానికి కూడా రియల్‌ ఎస్టేట్‌ వివాదమే కారణమని ప్రాథమిక సమాచారం. అతనితో సన్నిహితంగా ఉండే వ్యక్తి సుపారీ తీసుకొని తపంచాతో తెగబడ్డాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.గన్‌ కలిగి ఉండడం యువతకు స్టేటస్‌ సింబల్‌గా మారుతోంది. ఎక్కడికి వెళ్లినా ఆయుధం ధరించి వెళ్లడంతో పాటు స్నేహితుల వద్ద దాన్ని ప్రదర్శించేందుకు మొగ్గుచూపుతున్నారు. నేర ప్రవృత్తి గలవారు, కొంతమంది యూత్‌ రివాల్వర్‌తో తిరగడం స్టేటస్‌ సింబల్‌గా భావిస్తున్నారు.

గతంలో దక్కన ఇంజనీరింగ్‌ కాలేజీలో ఓ విద్యార్థి వద్ద రివాల్వర్‌ లభించగా, మరో ఎంబీబీఎస్‌ విద్యార్థి ఏకంగా పిస్తోల్‌తో సినిమా హాల్‌లో సంచరిస్తూ పోలీసులకు దొరికాడు. రియల్‌ ఎస్టేట్‌ గొడవల్లో విచ్చలవిడిగా సాగుతున్న ఆయుధాల వాడకం భయాందోళనకు గురిచేస్తోంది. లైసెన్సు రివాల్వర్‌తో కొందరు రెచ్చిపోతుంటే మరికొందరు అక్రమ ఆయుధాలతో రాజధానిలో కలకలం సృష్టిస్తున్నారు.లైసెన్స్‌ ఉన్న వారు, ఆయుధాలు వాడే వృత్తిలో ఉన్నవారు కూడా తమ ఆయుధాలను నిర్లక్ష్యంగా పెట్టడం నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ తన ఆయుధాన్ని పొగొట్టుకు న్న వంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. కాగా ఆత్మరక్షణ పేరుతో గన్‌ లైసెన్స్‌ తీసుకుంటున్న వారు వాటిని స్వప్రయోజనాలకు ఉపయోగించు కుంటున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లోని రియల్‌ ఎస్టేట్‌ తగాధాల్లో అనేక సందర్భాల్లో ఆయుధాలతో బెదిరింపునకు పాల్పడ్డ సంఘట నలు చోటుచేసుకున్నాయి.

నగరంలో లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌లు ఎన్ని ఉన్నాయనేది ఇంత వరకు లెక్క తేలలేదు. ప్రతి యేడాది పోలీసు స్టేషన్‌ల వారిగా లైసెన్స్‌డ్‌ ఆయుధాలు, రెన్యువల్‌ ఎన్ని జరుగుతున్నాయనేది కమిషరేట్‌ పోలీసు స్టేషన్‌ల వారిగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. రెండు సంవత్సరాలుగా ఆయుధాల లెక్క తేలడంలేదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఆరు నెలలకోసారి పోలీసులు ఆయుధాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. కాని ఈ ప్రక్రియపై ఎవరూ దృష్టి సారించడం లేదు. నయీం వద్ద కూడా దొరికిన ఆయుధాల్లో కొన్ని ప్రముఖులకు చెందిన లైసెన్స్‌ గన్‌లుగా పోలీసులు భావిస్తున్నారు.

అయితే వీటి లెక్కను బయటపెట్టడం లేదు. అధికారులు, రాజకీయ నేతల గన్‌లను నయీం పలు సెటిల్‌మెంట్‌ల కోసం ఉపయోగించినట్టు ఆధారాలు దొరికినట్టు సమాచారం.ఆయుధాలు కొనుగోలు చేస్తున్న కొంత మంది యువత ఆరుగురు సభ్యులతో బృందంగా ఏర్పడి గ్యాంగ్‌గా మారుతున్నారు. సంఘవిద్రోహ కార్యకలాపాలకు తెగబడుతున్నారు. మర్డర్‌కు ఓ రేటు, కిడ్నాప్‌కు ఓ రెటు అంటూ స్థాయిని బట్టి సుపారీ వసూలు చేసి సంఘ విద్రోహకార్యకలాపాలకు తెగ బడుతున్నారు. రౌడీషీటర్లు కూడా ఈ గ్యాంగ్‌లో సభ్యులుగా కొనసాగుతున్నారు. పోలీసులతో పరిచయాలు పెట్టుకుంటూ వీరి ఇష్టానుసారంగా సెటిల్‌మెంట్లకు దిగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌లుఉన్నా గ్యాంగ్‌లో తిరిగే వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు.