షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డిపై టీఆర్ఎస్ కన్ను?

Posted February 11, 2017

trs party want focus on shabbir ali and jeevan reddy
ఉత్తర తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ చేతుల్లోకి వచ్చేసింది. ముఖ్యంగా టీఆర్ఎస్ దెబ్బకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా చేతుల్లేసింది. ఇప్పుడా ప్రాంతంలో కాంగ్రెస్ కు కేవలం ఇద్దరంటే .. ఇద్దరు మాత్రమే ముఖ్య నాయకులు మిగిలారు. ఆ ఇద్దరే షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి.

షబ్బీర్ అలీ మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇక జీవన్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే. ఈ ఇద్దరూ టీఆర్ఎస్ పై వాయిస్ ను గట్టిగా వినిపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ ఇద్దరూ ముఖ్య నేతలే కావడంతో మీడియాలోనూ వీరి మాటలకు మంచి కవరేజ్ లభిస్తోంది. దీంతో ఇక లాభం లేదు.. ఏదో ఒకటి చేసి వీళ్లకు బ్రేకులేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందట. అందులో భాగంగా ఇప్పటికే గులాబీ నేతలు కన్నేశారని సమాచారం.

షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి తీసుకొస్తే మంచి అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ఆ ఇద్దరూ అంత ఈజీగా పార్టీ మారే పరిస్థితి లేదు. దీంతో సీఎం కేసీఆర్ స్థాయిలోనే సంప్రదింపులు జరిగితే.. ఏమైనా ఫలితం ఉండొచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగొచ్చన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరూ పార్టీ మారకపోయినా.. ఒకవేళ కేసీఆర్ స్వయంగా ఆఫర్ చేస్తే ఏమైనా జరగొచ్చు.

కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చి… వారిద్దరూ టీఆర్ఎస్ లోకి జాయిన్ అయిపోతే ఇక గులాబీదళం పంట పండినట్టే. ఉత్తర తెలంగాణలో మాత్రం క్వీన్ స్వీప్ చేసినట్టేనంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ ఏకమొత్తంగా టీఆర్ఎస్ ఖాతాలోకి పడిపోయినట్టేనని సంబురపడిపోతున్నారు. మరి వీళ్ల అంచనాలు.. నిజం అవుతాయో… లేదో చూడాలి.