భారత్ నెత్తిన పాలు పోస్తున్న ట్రంప్

0
56

Posted April 23, 2017 at 10:45

trump is making indians realizeమేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ ఘీంకరిస్తున్న ట్రంప్ కు.. అసలు విషయం తెలియడం లేదు. నిజంగా అక్కడున్న విదేశీయుల్ని వారి స్వదేశాలకు తరిమేస్తే.. అప్పుడే అమెరికా అసలు సత్తా బయటపడతుంది. అప్పుడెప్పుడో నోస్ట్రడామస్ చెప్పినట్లు అమెరికా పతనం కావాలంటే.. ఇది జరగాల్సిందే. అప్పుడే బ్రెయిన్ డ్రెయిన్ జరిగి అగ్రదేశం అనామక దేశంగా మిగిలిపోతుంది. వలసలతో బతికి, వలసదారుల చలవతో గొప్ప దేశంగా ఎదిగిన అమెరికా. ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం మన మంచికే అంటున్నారు పరిశీలకులు.

ఇండియన్ టెక్కీల టాలెంట్ కు ప్రపంచంలో ఎదురేలేదు. ఇది దేశాలకు అతీతంగా అందరూ ఒప్పుకునే మాటే. ఎందుకంటే అప్పుడెప్పుడో 2000వ సంవత్సరంలో వైటూకే సమస్యతో కంప్యూటర్లో ఏమవుతాయో అని దిగ్గజ దేశాలు అల్లాడితే.. దానికి పరిష్కారం కనుక్కుంది భారతీయ ఇంజినీర్లే. అమెరికా వెళ్లగొట్టినంత మాత్రాన వీరికి సంపాదన తగ్గుతుందనుకోవడం భ్రమే. ఎందుకంటే ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ దిగ్గజ కంపెనీల సీఈవోలందరూ.. ఇలాంటి పరిస్థితుల్లోనే గొప్ప కంపెనీలు పెట్టి అమెరికాకు పేరు తీసుకొచ్చారు.

ఇప్పుడు యూఎస్ కాకపోతే బ్రిటన్, బ్రిటన్ కాకపోతే ఆస్ట్రేలియా అనే పరిస్థితుల్లేవు. వీళ్లందరూ ఛీ కొడుతున్నా ఇక్కడే ఎందుకు బతకాలి. మనకు టాలెంట్ లేదా, స్వదేశానికి వెళ్లి కంపెనీలు పెట్టుకోలేమా అనేది మన ఇంజినీర్ల ఆలోచన. అందుకు తగ్గట్లుగానే ఎన్నారైలు మన దేశంలో ఉద్యోగాలు వెతుక్కోవడం పదిరెట్లు పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే మన దేశం కూడా సిలికాన్ వ్యాలీని తలదన్ని ఐటీలో అగ్రదేశంగా ఎదుగుతుందని, అప్పుడు మనం విదేశాలకు వెళ్లడం కాదు, విదేశీయూలే ఉద్యోగాల కోసం కాళ్లబేరానికి వస్తారని అంచనా.