అమెరికా లో ఇండియన్స్ కి ట్రంప్ షాక్ ఇచ్చినట్టేనా?

Posted December 11, 2016

trump shock to indians
గెలవడానికి ఎన్నికలు ముందు ఎన్నో చే చెబుతారు ..గెలిచాక చెప్పినవన్నీ చేస్తారా? ట్రంప్ విజయం తర్వాత అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు …ఇక్కడుంటున్న వారి కుటుంబాలు తమకి తాము చెప్పుకున్న ధైర్యమిది.అయితే అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న ట్రంప్ ఆ ధైర్యాన్ని బద్దలు కొట్టేస్తున్నారు.ఎన్నికల ముందు అమెరికన్ల ఉద్యోగాల కోసం H 1B వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.అబ్బాయికి,అమ్మాయికి అమెరికాలో ఉద్యోగమొస్తే చాలనుకునే సగటు భారతీయ తల్లితండ్రుల కలల్ని ఛిద్రం చేసే నిర్ణయాలకు ట్రంప్ సై అంటున్నారు.

అయోవా లో ట్రంప్ H 1 బి వీసాల విషయంలో తన వైఖరిని ఇంకోసారి స్పష్టం చేశారు. వివిధ సంస్థలు విదేశీయుల్ని ఉద్యోగాల్లో చేర్చుకుని అమెరికన్లకు అన్యాయం చేస్తున్నాయని …అలా బాధితులైన వారితో ఎన్నికల ప్రచారంలో ఎక్కువ సమయం గడిపానని …వారిని ఆదుకునే విషయంలో రాజీ ప్రసక్తే లేదని ట్రంప్ కుండ బద్దలు కొట్టారు.తక్కువ వేతనానికి వచ్చే విదేశీయులని ఉద్యోగాల్లో తీసుకోడానికి అమెరికన్లపై చాలా సంస్థలు పెడుతున్న ఆంక్షల్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు.ఏదేమైనా ట్రంప్ వ్యాఖ్యలు అమెరికన్ లకి భరోసా …భారతీయులకి భయాన్ని కలిగిస్తున్నాయి.